
ఢిల్లీ, 24మార్చి (హి.స.) : భారత సైన్యంలో లింగ సమానత్వం దిశగా అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. మహిళా సైనిక అధికారులకు శాశ్వత కమిషన్ (Permanent Commission) కల్పించే విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తనకున్న ప్రత్యేక అధికారాలను వినియోగిస్తూ, మహిళా అధికారుల హక్కులను కాపాడుతూ ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.
పెన్షన్ కష్టాలకు చెక్..
ఈ తీర్పుతో ముఖ్యంగా షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్లకు (SSCOs), ఈ న్యాయపోరాటంలో భాగస్వాములైన అధికారులకు భారీ ఊరట లభించింది. కేసు విచారణ దశలో ఉండగా, వివిధ కారణాలతో సర్వీస్ నుండి తప్పుకున్న లేదా విడుదలైన మహిళా అధికారులు కూడా ఇకపై పెన్షన్ ప్రయోజనాలు పొందేందుకు అర్హులని కోర్టు స్పష్టం చేసింది. వారు 20 ఏళ్ల సర్వీసును పూర్తి చేసినట్లుగానే పరిగణించాలని కేంద్రానికి దిశానిర్దేశం చేసింది.
ముఖ్యమైన అంశాలు
శాశ్వత కమిషన్: మహిళా అధికారులకు ఇప్పటికే మంజూరు చేసిన శాశ్వత కమిషన్‌లో ఎలాంటి మార్పులు ఉండవు. ప్రస్తుతం ఉన్న ఫ్రేమ్‌వర్క్‌లో ఎటువంటి జోక్యం చేసుకోవద్దని కోర్టు ఆదేశించింది.
పెన్షన్ అర్హత: సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న పెన్షన్ సమస్యకు ఈ తీర్పుతో పరిష్కారం లభించింది.
బకాయిలు ఉండవు: పెన్షన్ ప్రయోజనాలు కల్పించినప్పటికీ, గత కాలానికి సంబంధించిన జీతభత్యాల బకాయిలను మాత్రం చెల్లించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు