
కోల్కత్తా, 26 మార్చి (హి.స.)
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో
నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన శోభాయాత్రలను పోలీసులు అడ్డుకోవడంతో హిందూ సంఘాల ప్రతినిధులకు, పోలీసులకు మధ్య భారీ వాగ్వాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీరామనవమి పురస్కరించుకుని కోల్కతా వీధుల్లో హిందూ సంఘాలు భారీ ర్యాలీని చేపట్టాయి. అయితే, ఈ ర్యాలీలో కొందరు వ్యక్తులు సాంప్రదాయ ఆయుధాలను ప్రదర్శించడంపై పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ఆయుధ ప్రదర్శనకు అనుమతి లేదని పేర్కొంటూ పోలీసులు యాత్రను నిలిపివేయడానికి ప్రయత్నించారు. దీంతో ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తమ సంస్కృతిలో భాగమని, శాంతియుతంగా నిర్వహిస్తున్న యాత్రను అడ్డుకోవడం సరికాదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య నెట్టివేతలు జరగడంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది.
పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ఉన్నతాధికారులు అదనపు బలగాలను రంగంలోకి దించారు. సున్నిత ప్రాంతాల్లో పారామిలటరీ బలగాలతో పాటు భారీగా పోలీసులను యాత్రను మోహరించారు. కొనసాగించేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. వారిని వ్యాన్లలో స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. కోర్టు ఆదేశాల ప్రకారం నిర్ణీత మార్గాల్లోనే ర్యాలీలు జరగాలని, ఎటువంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదని పోలీసులు స్పష్టం చేశారు.ఆయుధాల ప్రదర్శన నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని వారు పేర్కొన్నారు. బెంగాల్లో శ్రీరామనవమి వేడుకల చుట్టూ ప్రతి ఏటా రాజకీయ వివాదాలు ముసురుతుంటాయి. తాజా ఘటనపై అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC), విపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే తాము చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం చెబుతుండగా, హిందూ పండుగలను కావాలనే అడ్డుకుంటున్నారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు