
హైదరాబాద్, 26 మార్చి (హి.స.)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను రూ.
115 కోట్లకు ముంచిన రిలయన్స్ టెలికాం (Reliance Telecom) వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రిలయన్స్ టెలికాం లిమిటెడ్ సంస్థతో పాటు ఆ సంస్థ మాజీ డైరెక్టర్లు సతీష్ సేథ్, గౌతమ్ బి. దోషులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కేసు నమోదు చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుట్ర, మోసం, అవినీతి నిరోధక చట్టం కింద ఈ చర్యలు తీసుకున్నారు. మొత్తం 11 బ్యాంకుల కన్సార్టియం ఈ సంస్థకు రూ. 735 కోట్ల టర్మ్ లోన్ సదుపాయాన్ని కల్పించగా, అందులో ఎస్బీఐకి రూ. 114.98 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు. నిధులను మళ్లించడం ద్వారా బ్యాంకును మోసం చేశారనే ఆరోపణలపై ఈ దర్యాప్తు ప్రారంభమైంది.
రుణ కేసు నమోదు చేసిన వెంటనే సీబీఐ అధికారులు ముంబైలోని సతీష్ సేథ్, గౌతమ్ బి. దోషి నివాసాలతో పాటు రిలయన్స్ టెలికాం రిజిస్టర్డ్ ఆఫీసులో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ కేసులో అజ్ఞాత ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరుల ప్రమేయంపై కూడా సీబీఐ ఆరా తీస్తోంది. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయని, లోతైన విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని సీబీఐ ప్రతినిధులు మీడియాకు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు