
న్యూఢిల్లీ, 26 మార్చి (హి.స.)
పశ్చిమ ఆసియాలో ఇజ్రాయెల్ అమెరికా - ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ యుద్ధ మేఘాల ప్రభావం ప్రపంచ దేశాలతో పాటు భారత్పై కూడా పడే అవకాశం ఉండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ మరియు వంటగ్యాస్ (LPG) సరఫరాలో తలెత్తుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగారు. పశ్చిమ ఆసియా పరిణామాలపై చర్చించేందుకు ప్రధాని మోడీ రేపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ భేటీలో పలు అంశాలపై చర్చించనున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదల మరియు దేశీయంగా పెట్రోల్, డీజిల్ నిల్వలపై సమీక్షించనున్నారు. ఇంధన కొరత ఉందంటూ వస్తున్న పుకార్లను అడ్డుకోవడం, భయాందోళనలు కలగకుండా ప్రజల్లో చూడాలని ఆదేశాలివ్వనున్నారు. రాష్ట్రాల వారీగా గ్యాస్ మరియు పెట్రోల్ సరఫరాలో ఎక్కడా అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించనున్నారు. యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల నుండి చమురు రవాణాకు ఆటంకం ఏర్పడటంతో భారత్లో గ్యాస్, పెట్రోల్ కష్టాలు మొదలయ్యే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై కేంద్ర పెట్రోలియం శాఖ ఇప్పటికే స్పందించింది. భారత్లో ప్రస్తుతం 60 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. యుద్ధం వల్ల సముద్ర మార్గాల్లో రవాణా ఇబ్బందులు ఎదురైతే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు దిగుమతి చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. చమురు నిల్వలను బ్లాక్ మార్కెట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు లేకుండా పర్యవేక్షించాలని ఇప్పటికే కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. రేపటి సమావేశం తర్వాత ఇంధన వినియోగం మరియు ధరల నియంత్రణపై కేంద్రం మరిన్ని కీలక మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు