కొనసాగుతున్న బుజ్జగింపుల పర్వం.. జీవన్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ కీలక భేటీ
జగిత్యాల, 24 మార్చి (హి.స.) జగిత్యాల జిల్లా రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంటోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడంతో పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ క్రమంలో ఇవాళ టీపీసీసీ చీ
Congress chief


జగిత్యాల, 24 మార్చి (హి.స.)

జగిత్యాల జిల్లా రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంటోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడంతో పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ క్రమంలో ఇవాళ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా రంగంలోకి దిగి, జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఆయనతో పాటు ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.

గత కొంతకాలంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో తనకు జరుగుతున్న అవమానాన్ని భరించలేనని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. అంతకుముందు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలు చర్చలు జరిపినప్పటికీ అవి ఫలించలేదు. దీంతో చివరి ప్రయత్నంగా టీపీసీసీ చీఫ్ స్వయంగా ఆయన వద్దకు వెళ్లారు.

మహేష్ కుమార్ గౌడ్ రాకతో జీవన్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జీవన్ రెడ్డిని కలిసేందుకు వచ్చిన జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు నందయ్యను లోపలికి అనుమతించవద్దని జీవన్ రెడ్డి అనుచరులు నినాదాలు చేశారు. దీంతో ఆయన అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. గతంలో జీవన్ రెడ్డికి సన్నిహితుడిగా ఉన్న నందయ్య, ఇటీవల ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో సఖ్యతగా ఉంటున్నారనే

ఆరోపణల నేపథ్యంలో ఈ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాక సందర్భంగా కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డికి పార్టీ కండువా కప్పే ప్రయత్నం చేశారు. అయితే, 'పార్టీలో జరిగిన అవమానం చాలు.. ఇక ఈ కండువా వద్దు' అంటూ ఆయన సున్నితంగా తిరస్కరించడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం జీవన్ రెడ్డితో టీపీసీసీ చీఫ్, ఇతర నేతల చర్చలు కొనసాగుతున్నాయి. రాజీనామా గడువుకు మరో 24 గంటల సమయం మాత్రమే ఉండటంతో, ఈ చర్చలు ఏ మలుపు తీసుకుంటాయోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande