
ఢిల్లీ, 24 మార్చి (హి.స.)
పశ్చిమాసియా యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరామం ఇచ్చారు. ఇరాన్తో నిర్మాణాత్మక చర్చలు జరుగుతున్నాయని, రెండ్రోజులుగా జరిగిన ఈ చర్చల కారణంగా ఇరాన్పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని ఆయన ప్రకటించారు. 48 గంటల్లో హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ పవర్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని హెచ్చరించిన ఆయన.. 24 గంటలు తిరిగేసరికి యుద్ధాన్ని ఆపేయడం గమనార్హం. అయితే ఈ చర్చలు సఫలమై యుద్ధం ఆగితే ప్రపంచ చమురు ధరలు సర్దుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు. అలాగే పశ్చిమాసియాలో శాంతి దిశగా ఇదే తొలి అడుగు అని అంటున్నారు. కానీ ఇరాన్ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలను ఖండించింది. అసలు తాము అమెరికాతో చర్చలే జరపడం లేదని షాకింగ్ ప్రకటన చేసింది.
ఒకపక్క ట్రంప్ దాడులు చేయబోమని ప్రకటించిన తర్వాత కూడా ఇజ్రాయెల్ వెనక్కు తగ్గలేదు. మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా ఇరాన్లో పలుచోట్ల తాము దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇదే సమయంలో తాను అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియోతో టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడినట్లు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు. పశ్చిమాసియా యుద్ధంతోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై యుద్ధం ప్రభావం గురించి చర్చించినట్లు చెప్పారు. ముఖ్యంగా ఎనర్జీ భద్రతపై ఆందోళన గురించి మాట్లాడానని జైశంకర్ వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV