
భద్రాద్రి కొత్తగూడెం, 25 మార్చి (హి.స.)
విద్యార్థుల ఆరోగ్యంతో ఆటలు.
ఆడితే ఊరుకోబోమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. దుమ్ముగూడెం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలపై బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఆహారం, వసతి, పరిశుభ్రత పై తనిఖీలు చేపట్టారు. లక్ష్మీనగరం పరిధిలోని కే.రేగుబల్లి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ బాలికల పాఠశాలలో పదో తరగతి ప్రత్యేక తరగతులను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి చదువు స్థాయి, గణిత పరీక్షల సిద్ధతను తెలుసుకున్నారు. గత ప్రశ్నాపత్రాలపై అవగాహనను పరీక్షిస్తూ ఉపాధ్యాయులకు బోధనలో స్పష్టత ఉండాలని, బలహీన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం డైనింగ్ హాల్, కిచెన్ పరిస్థితి చూసి కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాగే మీ ఇళ్లలో ఉంచుతారా? అంటూ సిబ్బందిని ప్రశ్నించారు. ఆరీ ప్లాంట్, నీటి ట్యాంకుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రికార్డులు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. స్టోర్రూమ్లో కేవలం క్యాబేజీ, ఆలుగడ్డ మాత్రమే ఉండటంపై సిబ్బంది పై ప్రశ్నలు గుప్పించారు విద్యార్థులకు సమతుల్య ఆహారం అందించాలని స్పష్టం చేశారు. మెనూ ప్రకారం బిర్యానీ వండకపోవడాన్ని గమనించి తీవ్రంగా మందలించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతను ఆయన పరిశీలించారు, కూరలో సరైన పదార్థాలు లేకపోవడాన్ని గుర్తించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వాస్తవ పరిస్థితులు తెలుసుకుని, నిర్లక్ష్యం పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో మాత్రం ఆహార నాణ్యత, నిర్వహణపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే నీటి సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల కలుషిత ఆహార ఘటనల నేపథ్యంలో పాఠశాలల్లో పరిశుభ్రత, ఆహార నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వారం రోజుల్లో మళ్లీ తనిఖీ చేస్తామని, అప్పటికీ మార్పులు కనిపించకపోతే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో తహసీల్దార్ అశోక్, మండల ప్రత్యేక అధికారి విజయలక్ష్మి, ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు