
హైదరాబాద్, 25 మార్చి (హి.స.)
పశ్చిమాసియాలో ముదురుతున్న
యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సప్లై చైన్ దెబ్బతిన్న నేపథ్యంలో, భారత్ తన ఇంధన అవసరాలను కాపాడుకోవడానికి రష్యాతో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఏప్రిల్ నెల అవసరాల కోసం భారతీయ రిఫైనరీలైన రిలయన్స్, IOC, BPCL, HPCL వంటి సంస్థలు కలిసి సుమారు 6 కోట్ల బ్యారెళ్ల (60 Million Barrels) ముడి చమురు రష్యా నుండి సెక్యూర్ చేశాయి. హర్మూజ్ జలసంధి ద్వారా మిడిల్ ఈస్ట్ దేశాల నుండి అందాల్సిన సరఫరా నిలిచిపోవడంతో, దేశీయంగా పెట్రోల్, డీజిల్ కొరత రాకుండా చూడటానికి కేంద్ర ప్రభుత్వం ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 100 నుండి 110 డాలర్లు మధ్య పలుకుతుండగా, భారత్ రష్యా నుండి సుమారు 5 నుండి 15 డాలర్ల ప్రీమియంతో ఈ చమురును కొనుగోలు చేస్తోంది. యుద్ధం కారణంగా రవాణా ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరిగినప్పటికీ, దేశీయంగా రిఫైనరీలను నిరంతరాయంగా నడపడానికి ఈ దిగుమతులు ఎంతో కీలకం. మార్చి నెలలోనే భారత్ రష్యా నుండి రోజుకు సగటున 20 లక్షల బ్యారెళ్లకు పైగా దిగుమతి చేసుకోవడం ద్వారా, రష్యా ఇప్పుడు భారతదేశానికి అతిపెద్ద చమురు సరఫరాదారుగా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.
ఈ పరిణామం కేవలం చమురు ఒప్పందం మాత్రమే కాకుండా.. అంతర్జాతీయ ఒత్తిళ్ల మధ్య భారత్ అనుసరిస్తున్న స్వతంత్ర విదేశీ విధానానికి నిదర్శనం అని అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు అమెరికా ఆంక్షల సడలింపును వాడుకుంటూ ఇరాన్ నుండి చమురు సేకరిస్తూనే, మరోవైపు రష్యా నుండి భారీ స్థాయిలో దిగుమతులు చేసుకోవడం ద్వారా భారత్ తన 'ఎనర్జీ బాస్కెట్'ను సుస్థిరపరుచుకుంటోంది. అయితే యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే రష్యా కూడా ధరలను పెంచే అవకాశం ఉన్నందున, భారత్ మరిన్ని ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు