
అమరావతి, 25 మార్చి (హి.స.)
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) సినిమాల్లో నటించకుండా నిలువరించాలని దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. దీంతో ఆయనకు ఏపీ హైకోర్టు (High Court)లో పెద్ద ఊరట లభించింది. వివరాల్లోకి వెళితే.. డిప్యూటీ సీఎం హోదాలో ఉంటూ పవన్ సినిమాల్లో నటించడం అనైతికమని, 'హరిహర వీరమల్లు' సినిమా కోసం టికెట్ ధరలు పెంచి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ (Former IAS officer Vijay Kumar) హైకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే మంత్రి పదవిలో ఉండి వాణిజ్య కార్యక్రమాల్లో పాల్గొనడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ వాదించారు.
అయితే, ఈ విచారణలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (AG) బలమైన వాదనలు వినిపించారు. మంత్రులు, ముఖ్యమంత్రులు సినిమాల్లో నటించకూడదని ఎక్కడా చట్టపరమైన ఆంక్షలు లేవని, గతంలో ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విషయంలో హైకోర్టు ఫుల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా గుర్తు చేశారు. టికెట్ ధరల పెంపు అనేది నిర్మాతల అభ్యర్థన మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే తప్ప, అందులో పవన్ కళ్యాణ్ ప్రమేయం లేదని ఏజీ స్పష్టం చేశారు. దీంతో ఈ పిటిషన్ ను కొట్టివేసిన కోర్టు.. ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ ఉద్దేశంతో పిటిషన్ వేసి కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు పిటిషనర్పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV