
హైదరాబాద్, 25 మార్చి (హి.స.)
నగరంలో ఇంధన కొరత ఉందంటూ
జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. నగరంలో దాదాపు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఇంధన సరఫరా పై తలెత్తిన అపోహల నేపథ్యంలో టీజీసీసీసీలో కలెక్టర్ హరిచందన, అదనపు సీపీ తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ శ్వేత, సివిల్ సప్లై అధికారులతో కలిసి ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఆయిల్ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, నగరవ్యాప్తంగా సరఫరా నిరాటంకంగా కొనసాగుతోందని తెలిపారు. ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు వాహనాలకు ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం వల్ల అకస్మాత్తుగా డిమాండ్ పెరిగి, కొన్ని చోట్ల తాత్కాలికంగా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని తెలిపారు. వచ్చి
దీనిని కొరతగా భావించవద్దని కోరారు. తప్పుడు ప్రచారాల వల్ల హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 22న 3,024 కిలోలీటర్ల ఇంధనం అమ్ముడవగా, 23న ఆ సంఖ్య రెట్టింపు అయితుందని.. 6,400 కిలోలీటర్లకు చేరుకుందని, జనం భయాందోళన చెందడం వల్లే అమ్మకాలు ఈ స్థాయిలో పెరిగాయని తెలిపారు. అంతే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా బాటిళ్లు, డబ్బాల్లో లూజ్ పెట్రోల్ లేదా డీజిల్ విక్రయిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేసే వారిపై నిఘా ఉంచామని, అటువంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. కమిషనరేట్ పరిధిలోని 240 పెట్రోల్ బంకుల్లో పరిస్థితిని సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి మాట్లాడుతూ.. ఆయిల్ సంస్థలు, సివిల్ సప్లై అధికారులతో పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని, ప్రజల సౌకర్యార్థం ప్రత్యేకంగా కంట్రోల్ రూంను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా పరిధిలోని 186 బంకుల్లో ఇంధన సరఫరా సజావుగా సాగుతోందని, ప్రజలు అనవసర ఆందోళనతో బంకుల వద్ద రద్దీ పెంచవద్దని కోరారు. నిత్యావసర సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, క్షేత్రస్థాయిలో యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రజలు వాస్తవాలను గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు