
కామారెడ్డి, 25 మార్చి (హి.స.)
రోగులకు మెరుగైన వైద్య సేవలు
అందించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. బుధవారం కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, ఔషధాల లభ్యత, రోగులకు అందుతున్న సౌకర్యాలు, హాజరు రిజిస్టర్లు తదితర అంశాలను పరిశీలించారు. ఆసుపత్రిలో శుభ్రత, వైద్య సిబ్బంది సమయపాలన, రోగుల పట్ల వ్యవహార శైలి వంటి విషయాలపై ప్రత్యేక దృష్టి సారించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా, ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య సేవలను అవగాహన సమర్ధవంతంగా వినియోగించుకునేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఆయన వెంట వైద్యాధికారి సాయి ఈశ్వరి, సంబంధిత వైద్య అధికారులు, సిబ్బంది ఉన్నారు.
కామారెడ్డి పట్టణంలోని పెద్ద చెరువులో బుధవారం ముందస్తు వరద సహాయక చర్యల పై సమగ్ర మాక్ డ్రిల్ నిర్వహించారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్ డీ ఆర్ ఎఫ్) సమన్వయంతో జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ(డీడీఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమం వరద పరిస్థితుల్లో రక్షణ చర్యలు, శాఖల మధ్య సమన్వయం, స్పందన సామర్థ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా, మాక్ డ్రిల్ లో వరదలో చిక్కుకున్న బాధితులను రక్షించే విధానాలను ప్రదర్శిస్తూ రెస్క్యూ బోట్లు, లైఫ్ జాకెట్లు, తాళ్ల సహాయంతో రక్షణ వంటి పద్దతులు చూపించారు. 3
మొత్తం 12 శాఖలు అగ్నిమాపక, పోలీస్, వైద్య, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ తదితర విభాగాలు చురుకుగా పాల్గొన్నాయి. 187 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడుతూ.. విపత్తు సమయంలో సమన్వయం, తక్షణ స్పందన, ప్రజల అవగాహన అత్యంత కీలకమని పేర్కొన్నారు. మాక్ డ్రిల్ ద్వారా ప్రజల రక్షణ పై అవగాహన, ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను ఎలా సురక్షితంగా రక్షించాలో తెలియజేయడానికి ఈ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందన్నారు. మాక్ డ్రిల్ ద్వారా ప్రజల్లో అప్రమత్తత పెంపొందించడం ముఖ్యమని తెలిపారు. విపత్తు సంభవించినప్పుడు భయపడకుండా, సరైన చర్యలు తీసుకుంటే ప్రాణ నష్టం తగ్గించవచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఏ ఎస్పీ చైతన్య రెడ్డి, డిప్యూటీ కమాండర్ డోల్ సింగ్, ఎన్డీఆర్ఎఫ్ బృందం, జిల్లా అగ్నిమాపక అధికారి సుధాకర్, ఆర్డీవో వీణ, తహసీల్దార్ హిమబిందు, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ సిబ్బంది, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు