
హైదరాబాద్, 25 మార్చి (హి.స.) రాష్ట్రంలో అర్హులైన పేదల కోసం
నిర్మించి ఇస్తున్న ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. మార్చి 31 నాటికి లక్షా 12 వేల ఇళ్లు పూర్తవుస్తున్నాయని, వివిధ నిర్మాణ దశల్లో ఉన్న మరో లక్ష ఇందిరమ్మ ఇళ్లు జూన్ నెల వచ్చేసరికి పూర్తి కాబోతున్నాయని తెలిపారు. ఏప్రిల్ చివరి వారం లేదా మే నెల నుంచి రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు చేపడుతామని మంత్రి ప్రకటించారు. గతంలో సగం నిర్మించి వదిలేసిన గృహలక్ష్మి ఇళ్లకు కూడా నిధులు ఇస్తామని స్పష్టం చేశారు. ఇల్లు కట్టినదాన్ని బట్టి ఆర్థిక సహాయం ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని గుర్తుచేశారు. ఇక పట్టణాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కూడా పొంగులేటి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామన్నారు. గ్రేటర్ పరిధిలో బస్తీలకు దగ్గర్లోనే ఇళ్ల నిర్మాణాలు చేపడుతామన్నారు. నగరాలకు దూరంగా ఇళ్లు ఇస్తుంటే.. లబ్దిదారులు వెళ్లడం లేదన్నారు. వారికి అందుబాటులోనే ఇళ్లను నిర్మించి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు. గ్రేటర్ పరిధిలో ఇప్పటికే 14-15 స్లమ్స్ ను గుర్తించామన్నారు. గ్రేటర్ సహా రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నివాసయోగ్యమైన స్థలాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతామన్నారు. ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ వంటి నగరాల్లోనూ ఇళ్ల నిర్మాణాలు చేపడుతామన్నారు.
కాగా.. అంతకుముందు స్పీకర్ గడ్డం ప్రసాద్ మంత్రి పొంగులేటిపై అసహనం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఇళ్లపై ప్రశ్నలు తలెత్తడంతో.. గతంలో తాను ఇచ్చిన సూచనలను మంత్రి పట్టించుకోకపోవడం వల్లే ఇప్పుడు సభలో ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయని స్పీకర్ వ్యాఖ్యానించారు. సభలో డబుల్ బెడ్రూం ఇళ్లపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తున్న సమయంలో స్పీకర్ జోక్యం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న రెండు పడక గదుల ఇళ్ల పరిస్థితిపై జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించాలని తాను గతంలోనే మంత్రికి సూచించినట్లు స్పీకర్ గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి ఇళ్ల పురోగతిపై రివ్యూ చేయమని గతంలోనే చెప్పానని, కానీ పొంగులేటి తన మాటల్ని సీరియస్ గా తీసుకోలేదన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..