పెట్రోల్ బంక్లకు క్యూ కట్టిన జనం.. కొరత భయంతో వాహనదారుల ఆందోళన
నిజామాబాద్, 25 మార్చి (హి.స.) పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో ఇంధన సరఫరా నిలిచిపోతుందనే ఊహాగానాలు నిజామాబాద్ నగరంలో కలకలం రేపాయి. పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే భయంతో వాహనదారులు బంకుల వద్ద భారీగా చేరడంతో కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపించాయి
Petrol pump


నిజామాబాద్, 25 మార్చి (హి.స.)

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో

ఇంధన సరఫరా నిలిచిపోతుందనే ఊహాగానాలు నిజామాబాద్ నగరంలో కలకలం రేపాయి. పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే భయంతో వాహనదారులు బంకుల వద్ద భారీగా చేరడంతో కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపించాయి. తెరిచి ఉన్న బంకులు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ఆటోలు, కార్లు, బైకులు వరుసగా నిలబడి ఇంధనం కోసం వేచి చూశాయి. బుధవారం ఆలూర్, ఆర్మూర్, మాక్లూర్, నందిపేట్ తదితర ప్రాంతాల్లో కొంతమంది బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు దర్శనమిచ్చాయి. కొన్ని బంకుల్లో పెట్రోల్ అందుబాటులో ఉన్నప్పటికీ డీజిల్ లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ట్రాక్టర్లు, సరుకు వాహనాలు నడిపేవారు డీజిల్ దొరకక ఇబ్బంది పడ్డారు.

గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. కొంతమంది వాహనదారులు ముందస్తు జాగ్రత్తగా డబ్బాలు, కేన్లలో పెట్రోల్ నింపుకుని వెళ్లిన దృశ్యాలు కనిపించాయి. దీంతో బంకుల వద్ద రద్దీ మరింత పెరిగింది. సాధారణం కంటే రెట్టింపు స్థాయిలో వాహనాలు రావడంతో అందుబాటులో ఉన్న నిల్వలు వేగంగా ఖాళీ అయ్యాయి. అయితే, వాస్తవానికి రాష్ట్రంలో ఇంధన కొరత లేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత పరిస్థితికి ఆయిల్ కంపెనీల విధాన మార్పులే కారణమని బంకుల యజమానులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు డీలర్లకు ఇచ్చిన క్రెడిట్ సదుపాయాన్ని ఈ నెలలో నిలిపివేయడంతో, నగదు చెల్లించినప్పుడే ఇంధన సరఫరా జరుగుతోంది. దీంతో చాలామంది డీలర్లు ముందస్తుగా డబ్బులు చెల్లించలేక బంకులను తాత్కాలికంగా మూసివేస్తున్నారు. మార్చి 31తో ఆర్థిక

సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ పరిణామాలు వాహనదారుల్లో అనవసర ఆందోళనకు దారితీస్తున్నాయి. అధికారులు మాత్రం ప్రజలు గందరగోళానికి గురి కావద్దని, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని స్పష్టం చేస్తున్నారు.

పెట్రోల్, డీజిల్ కు ఎలాంటి కొరత లేదని, సోషల్ మీడియాలో కొరత ఉన్నట్లు వస్తున్న వదంతులను ఎవరు నమ్మవద్దని ఆర్మూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్య నారాయణ గౌడ్ తెలిపారు.ఇంధన సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందన్నారు. పెట్రోల్, డీజిల్ కొరత ఉందని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొరత ఉండవచ్చనే ఆందోళనతో వాహనదారులు ఒకేసారి బంకులకు వచ్చి రద్దీ సృష్టించవద్దని కోరారు. పెట్రోల్ బంకుల్లో తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande