
హైదరాబాద్, 25 మార్చి (హి.స.)
రాష్ట్రంలోని మాంసం ప్రియులకు
తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ (Telangana Chicken Shop Owners Association) తీసుకున్న నిర్ణయం బిగ్ షాక్ ఇచ్చింది. పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే కమీషన్, మార్జిన్ను భారీగా తగ్గించడాన్ని నిరసిస్తూ ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులను మూసివేయాలని (బంద్) నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. పౌల్ట్రీ కంపెనీల ఏకపక్ష నిర్ణయాల వల్ల చిరు వ్యాపారుల మంతా తీవ్రంగా నష్టపోతున్నామని, మార్జిన్ పెంచే వరకు తమ పోరాటం ఆపేది లేదని అసోసియేషన్ స్పష్టం చేసింది.
ప్రస్తుతం చికెన్ ధరలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ, విక్రయదారులకు వచ్చే లాభం మాత్రం గణనీయంగా తగ్గిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వేసవి కాలం, ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగిందని, అయితే ఆ భారం అంతా తమపైనే పడుతోందని చికెన్ షాప్ ఓనర్స్ ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం, పౌల్ట్రీ కంపెనీలు వెంటనే స్పందించి మార్జిన్ సమస్యను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఈ నిరసనను నిరవధికంగా కొనసాగిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు