
హైదరాబాద్, 25 మార్చి (హి.స.)
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల
వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం గా మారుతోంది. తాజాగా ఈ రోజు జరిగిన విచారణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై హైకోర్టు (High Court) కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి చేరిన పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని ఇటీవల అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం, స్పీకర్తో పాటు ఏడుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ముఖ్యంగా దానం నాగేందర్, అరికెపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావులపై వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, ఈ వ్యవహారంపై పూర్తి వివరణతో కౌంటర్ దాఖలు (Counter filing) చేయాలని వారిని ఆదేశించింది.
అలాగే అసెంబ్లీ స్పీకర్ (Assembly Speaker) నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, ఫిరాయించిన వారిపై తక్షణమే అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు జోక్యం చేసుకోవడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. స్పీకర్ కార్యాలయం నుంచి వచ్చే స్పందన, ఎమ్మెల్యేలు ఇచ్చే కౌంటర్ అఫిడవిట్లపై ఈ కేసు భవిష్యత్తు ఆధారపడి ఉన్నట్లు తెలుస్తుంది. న్యాయస్థానం ఈ సంచలన కేసు తదుపరి విచారణను వచ్చే నెల 16 కు వాయిదా వేయడంతో, అప్పటి వరకు ఈ ఉత్కంఠ కొనసాగనుంది. ఇదిలా ఉంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా ఎమ్మెల్యే దానం నాగేందర్ కు, స్పీకర్ కు కోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ పిటిషన్ తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 16 కు వాయిదా వేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు