
హైదరాబాద్, 25 మార్చి (హి.స.)
తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కలకలం రేపుతున్న పెట్రోల్, డీజిల్ కొరత వార్తలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం కీలక ప్రకటన చేసారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని, రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణలో చమురు కొరత ఏర్పడిందనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని బండి సంజయ్ తేల్చి చెప్పారు. ఇండియన్ ఆయిల్ (IOCL), హెచ్పీసీఎల్ (HPCL), బీపీసీఎల్ (BPCL) వంటి ప్రభుత్వ రంగ సంస్థల వద్ద దేశ అవసరాలకు సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని ఆయన ధృవీకరించారు. కేంద్ర ప్రభుత్వం నిరంతరం ఆయిల్ నిల్వలను పర్యవేక్షిస్తోందని, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు ఆయన గుర్తు చేశారు.
కొందరు కావాలనే సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తూ కృత్రిమ కొరత సృష్టించాలని చూస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఈ పుకార్లను నమ్మి వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు క్యూ కట్టడం వల్ల, కొన్ని చోట్ల తాత్కాలికంగా స్టాక్ అయిపోతోందని, దీనివల్ల సాధారణ వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన విశ్లేషించారు. వాహనదారులు తమ రోజువారీ అవసరాలకు తగ్గట్లుగానే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని, అనవసరంగా ట్యాంకులు నింపుకుని నిల్వ చేయవద్దని కోరారు. ఇదే అదనుగా ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్కు తరలించి లాభపడాలని చూసే శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని బండి సంజయ్ హెచ్చరించారు. ప్రజలు సంయమనం పాటిస్తే సరఫరా యథావిధిగా సాగుతుందని భరోసా ఇచ్చారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయంగా నెలకొన్న చమురు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అన్ని చర్యలు తీసుకుంటోందని బండి సంజయ్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు