వరంగల్ జిల్లా వాతావరణంపై లోక్సభలో ప్రస్తావించిన ఎంపీ డాక్టర్ కావ్య
న్యూఢిల్లీ, 25 మార్చి (హి.స.) వరంగల్ జిల్లాలో ఆధునిక వాతావరణ పర్యవేక్షణ సదుపాయాల్లో ఉన్న లోటుపాట్లను వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లోక్సభలో ప్రస్తావించారు. ఇటీవలి కాలంలో తీవ్ర వాతావరణ మార్పులు పెరుగుతున్న నేపథ్యంలో, జిల్లాలో తగిన స్థాయి వాతావరణ మౌలి
MP Kavya


న్యూఢిల్లీ, 25 మార్చి (హి.స.)

వరంగల్ జిల్లాలో ఆధునిక వాతావరణ పర్యవేక్షణ సదుపాయాల్లో ఉన్న లోటుపాట్లను వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లోక్సభలో ప్రస్తావించారు. ఇటీవలి కాలంలో తీవ్ర వాతావరణ మార్పులు పెరుగుతున్న నేపథ్యంలో, జిల్లాలో తగిన స్థాయి వాతావరణ మౌలిక సదుపాయాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని ఎంపీ పేర్కొన్నారు. ఈ అంశంపై స్పందించిన భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి డా. జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. వరంగల్ లో ప్రస్తుతం ఆటోమేటిక్ వేదర్ స్టేషన్లు, వర్షపాతం కొలిచే గేజ్లు పనిచేస్తున్నాయని తెలిపారు. అయితే, వరంగల్లో డాప్లర్ వెదర్ రాడార్ (DWR) ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్, విశాఖపట్నంలో ఉన్న రాడార్ల ద్వారా వరంగల్ ప్రాంతానికి సేవలు అందుతున్నాయని చెప్పారు. అలాగే, వరంగల్ జిల్లాలో ప్రత్యేకంగా వరద హెచ్చరిక కేంద్రం లేకపోయినా, సమీప జిల్లాల్లో ఉన్న కేంద్రాల ద్వారా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని కేంద్రమంత్రి వివరించారు. దీనిపై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య స్పందిస్తూ, ఇతర ప్రాంతాలపై ఆధారపడటం వల్ల అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనలో లోపాలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. జిల్లా స్థాయిలోనే ఖచ్చితమైన వాతావరణ అంచనాలు, మెరుపు హెచ్చరిక వ్యవస్థలు, క్లైమేట్ రెసిలియెన్స్ మెకానిజంలను బలోపేతం చేయాలని కోరారు. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న అలర్ట్ వ్యవస్థలు, 'మిషన్ మౌసమ్' వంటి కార్యక్రమాలు ఉన్నప్పటికీ, వరంగల్ వంటి సున్నిత ప్రాంతాల కోసం ప్రత్యేక పెట్టుబడులు అవసరమని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించేందుకు ముందస్తు చర్యలు, సమగ్ర విపత్తు నిర్వహణ వ్యవస్థలను మరింత పటిష్టం చేయాలని కేంద్ర ప్రభుత్వన్ని కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande