
ఢిల్లీ, 25మార్చి (హి.స.) కాంగ్రెస్ పార్టీ పాత ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేయాలంటూ కేంద్రం నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. దిల్లీలోని 24 అక్బర్ రోడ్డులో ఉన్న ఈ ఆఫీసును శనివారం (మార్చి, 28) లోగా ఖాళీ చేయాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. గత 48 ఏళ్ల పాటు ఈ బంగ్లానే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంగా (party office) కొనసాగింది.
గతేడాది కోట్లా మార్గ్లో ‘ఇందిరా భవన్’(Indira Bhavan) పేరుతో కొత్త ఆఫీసును ప్రారంభించినా.. ఇప్పటికీ అక్బర్ రోడ్డు ఆఫీసు నుంచే కార్యకలాపాలు సాగిస్తోంది. అయితే, ప్రభుత్వ బంగ్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉండకూడదని గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగానే పార్టీలు సొంత భవనాలు నిర్మించుకున్నాయి. కాంగ్రెస్(Congress) కూడా కొత్త ఆఫీసును ఏర్పాటు చేసుకున్నప్పటికీ.. పాత బంగ్లాను ఖాళీ చేయలేదు. ఈ క్రమంలోనే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. అక్బర్ రోడ్డులోని బంగ్లాతో పాటు 5, రైసినా రోడ్డులో ఉన్న యూత్ కాంగ్రెస్ ఆఫీసును కూడా శనివారం లోగా ఖాళీ చేయాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నట్టు సమాచారం. దీనిపై కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ స్పందిస్తూ.. ‘‘ఇది చట్ట విరుద్ధమైన, రాజకీయ ప్రేరేపిత చర్య. దీనిపై అన్నివిధాలా న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు పార్టీ సిద్ధమైంది’’ అని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ