
చెన్నై,/ఢిల్లీ, 25మార్చి (హి.స.)న్యూస్టుడే: తమిళనాడు శాసనసభ ఎన్నికల బరి నుంచి నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్హాసన్కు చెందిన మక్కళ్ నీది మయ్యం పార్టీ తప్పుకొంది. ప్రస్తుత క్లిష్ట రాజకీయ పరిస్థితుల్లో డీఎంకే కూటమిలో తమకు కేటాయిస్తామన్న సీట్ల సంఖ్య, డీఎంకే గుర్తుతో పోటీ చేయాలన్న ప్రతిపాదన పార్టీ సభ్యులకు, తనకు ఆమోదయోగ్యం కాదని కమల్హాసన్ మంగళవారం రాత్రి ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ ప్రతిపాదన వెనుక వారి (డీఎంకే) వైపు న్యాయం ఉందని కూడా అర్థం చేసుకొంటున్నట్లు తెలిపారు. తమిళనాడును హస్తగతం చేసుకోవాలని మతవాద శక్తులు అన్ని విధాలుగా కుట్ర చేస్తున్న నేపథ్యంలో కూటమి విజయావకాశాలే ప్రధానమన్నారు. రాష్ట్ర హక్కులను కేంద్రం ఒకటొకటిగా హరించి, ప్రజల సంక్షేమాన్ని తిరస్కరించిన పరిస్థితుల్లో.. కూటమిలో సీట్ల భాగస్వామ్యాన్ని కోరడం మంచి సోదరుడి లక్షణం కాదన్నారు. ‘‘ఇది త్యాగం కాదు, కర్తవ్యం.. స్వలాభం కాదు, సంయమనం’’ అని పేర్కొన్నారు. తద్వారా సరికొత్త రాజకీయాలకు బీజం వేస్తున్నట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ