
అమరావతి, 26 మార్చి (హి.స.)
: ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై మంత్రులు అనిత, జనార్థన్ రెడ్డితో పాటు పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా ఎస్పీ, కలెక్టర్తో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్ష చేశారు సీఎం. ప్రమాదం జరిగిన తీరుపై ప్రాథమిక సమాచారాన్ని ముఖ్యమంత్రికి జిల్లా ఎస్పీ, కలెక్టర్ వివరించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారని సీఎంకు తెలిపారు.
ఈ దుర్ఘటనలో 13 మంది చనిపోయారని, 22 మంది గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు చెప్పారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ముఖ్యమంత్రికి వివరించారు. హరికృష్ణ ట్రావెల్స్కు చెందిన ఈ బస్సు జగిత్యాల నుంచి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంపై డ్రైవర్ను విచారించగా.. తన వాహనం స్టీరింగ్ స్టక్ అయ్యిందని చెప్పాడని.. దీనిపై నిజానిజాలను అధికారులు పరిశీలిస్తున్నారని సీఎంకు తెలియజేశారు. బస్సు పూర్తిగా ఆపోజిట్ రూట్లో వెళ్లడం వల్లనే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామని అధికారులు వెల్లడించారు.
గాయపడిన వారిలో పరిస్థితి విషమంగా ఉన్నవారిని గుంటూరు ఆసుపత్రికి తరలించే ఆలోచనలో ఉన్నామని సీఎంకు జిల్లా కలెక్టర్ తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, బాధిత కుటుంబాలకు తగిన నష్టపరిహారం చెల్లించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ