
ఏలూరు, , 26 మార్చి (హి.స.)
:ఏలూరులోని సర్ సి.ఆర్.రెడ్డి ఫార్మసి కాలేజ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హాస్టల్ భవనంపై నుంచి దూకి ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూసింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
ఏలూరులోని సర్ సి.ఆర్.రెడ్డి ఫార్మసి కాలేజ్లో బీ పార్మసీ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని, ఇటీవల కాలేజ్ హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ప్రమాదంలో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. కాలేజ్ యాజమాన్యం, తోటి విద్యార్థులు ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నమూసింది. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
నగరంలో విద్యుత్ ప్రమాదాలు స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా, ఏలూరులోని ఒక ప్రధాన ప్రాంతంలో విద్యుత్ స్తంభంపై ఒక్కసారిగా భారీగా అగ్నికీలకలు ఎగసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికుల కథనం ప్రకారం.. విద్యుత్ స్తంభంపై ఉన్న వైర్లలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే అగ్నికీలలు భారీగా ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. భయంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అధికారులు వచ్చి అప్పటికప్పుడు తాత్కాలికంగా వైర్లను సరిచేసి వెళ్తున్నారే తప్ప, శాశ్వత పరిష్కారం చేయడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ