
ఢిల్లీ, 26మార్చి (హి.స.)పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణాకు ఆటంకాలు ఏర్పడిన నేపథ్యంలో ఇంధన భద్రత కోసం భారత్ అడుగులు వేస్తోంది. ఏప్రిల్ నెలకు దాదాపు 60 మిలియన్ బ్యారెళ్ల రష్యా ముడి చమురును భారత్ కొనుగోలు చేసిందని బ్లూమ్బర్గ్ నివేదికలో పేర్కొంది. సరఫరా కొరత, డిమాండ్ అధికంగా ఉండటంతో ఈ చమురును బ్రెంట్ చమురు ధర కంటే ప్రతి బ్యారెల్కు 5- 15 డాలర్ల అదనపు ప్రీమియంతో కొనుగోలు చేశారు. ప్రస్తుత నెల కొనుగోళ్లతో ఇవి సమానంగా ఉన్నప్పటికీ.. ఫిబ్రవరిలో కొనుగోలు చేసిన దానికంటే రెండింతలు ఎక్కువని డేటా ఇంటెలిజెన్స్ సంస్థ కెప్లర్ పేర్కొంది. మార్చి 5 కంటే ముందే నౌకల్లో లోడ్ చేసిన రష్యా చమురును తీసుకోవడానికి అమెరికా మినహాయింపు ఇవ్వడం ఈ కొనుగోళ్లకు కలిసొచ్చింది. తర్వాత ఈ మినహాయింపును మార్చి 12లోపు సముద్రంలో ఉన్న నౌకలకు కూడా విస్తరించారు.
మళ్లీ రష్యా మార్కెట్ వైపు రిఫైనరీలు: అమెరికా ఒత్తిడి కారణంగా డిసెంబరు నుంచి రష్యా చమురుకు దూరంగా ఉన్న మంగళూరు రిఫైనరీ, హిందుస్థాన్ మిత్తల్ ఎనర్జీ వంటి భారతీయ రిఫైనరీలు మళ్లీ కొనుగోళ్లను ప్రారంభించాయి. ఇటీవలి నెలల్లో సౌదీ అరేబియా, ఇరాక్ నుంచి సరఫరాపై భారత్ దృష్టి పెట్టినప్పటికీ, యుద్ధం కారణంగా ఆ కార్గోలు పర్షియన్ గల్ఫ్లో చిక్కుకుపోవడంతో రిఫైనరీలు మళ్లీ రష్యా వైపు మొగ్గుచూపాయి.
భౌగోళిక రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఇతర దేశాల నుంచి చమురు దిగుమతుల కోసం భారత్ చూస్తోంది. కెప్లర్ గణాంకాల ప్రకారం.. ఏప్రిల్లో వెనెజువెలా నుంచి సుమారు 8 మిలియన్ బ్యారెళ్ల చమురు దిగుమతి కానుంది. 2020 అక్టోబరు తర్వాత ఇదే అత్యధికం.
2
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ