
హైదరాబాద్, 26 మార్చి (హి.స.)
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై
ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (MLA Rakesh Reddy) మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ ఆసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణలో కల్తీ కల్లు మరణాలు, గల్ఫ్ కార్మికుల సమస్యలు, ప్రభుత్వ పథకాలకు పెడుతున్న పేర్లపై దుమ్మెత్తిపోశారు. ఉత్తర తెలంగాణలో ఆన్ఫ్రాజోలం (Alprazolam) కల్తీ కల్లు వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ లేని ఉత్తర తెలంగాణను నిర్మించాలని డిమాండ్ చేస్తూనే.. మద్యం బ్రాండ్లలాగే ఇప్పసారాకు పింక్ లేబుల్ వంటి పేర్లు పెట్టి ప్రభుత్వమే సరఫరా చేయాలని ఎద్దేవా చేశారు.
ప్రతి పథకానికి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi) పేరు పెట్టడం ద్వారా ఆమెను అవమానించవద్దని రాకేష్ రెడ్డి హితవు పలికారు. సోషల్ మీడియాలో ఆమెపై వస్తున్న అభ్యంతరకర వీడియోలను ఖండించిన ఏకైక ఎమ్మెల్యేను తానేనని గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాలకు తెలంగాణ అమరవీరుల పేర్లు, మాజీ సీఎంల పేర్లు మీకు దొరకడం లేదా అని ప్రశ్నించారు.
సోనియా గాంధీని బలిదేవత అన్న వ్యక్తే ఇప్పుడు కాంగ్రెస్ (Congress) పార్టీలో సీఎం అయ్యారని కామెంట్ చేశారు. 40 ఏళ్లుగా పార్టీకి సేవ చేసిన జీవన్ రెడ్డి (Jeevan Reddy) వంటి నేతలను అవమానిస్తూ బయటకు పంపుతున్నారని మండిపడ్డారు. కౌలుదారులు వచ్చి కాంగ్రెస్ను నాశనం చేస్తున్నారని.. నిన్న రాజీనామా చేస్తున్న నేపథ్యంలో జీవన్ రెడ్డి మాటలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చనిపోయిన 120 మంది గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ఇంకా పరిహారం అందలేదని, వారు సచివాలయం చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వానికి కనికరం లేదని ధ్వజమెత్తారు. బడ్జెట్లో గల్ఫ్ సంక్షేమ నిధికి రూ.1000 కోట్లు కేటాయించాలని రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు