
హైదరాబాద్, 26 మార్చి (హి.స.)
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలే పూర్తి కాకముందే విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలలు వల వేస్తున్నాయి. ఓ వైపు విద్యార్థులు పరీక్షలు రాస్తుండగానే ఐఐటీ, నీట్, స్టేట్ ఎంట్రెన్స్లకు కోచింగ్ ఇస్తామని, తమకు జాతీయస్థాయిలో ర్యాంకులు వచ్చాయని తల్లిదండ్రులను బుట్ట వేసుకుంటున్నారు. రోజుల తరబడి వారికి కౌన్సెలింగ్ ఇస్తూ విద్యార్థులను చేర్చుకుంటున్నారు. ఇంటర్మీడియట్ అడ్మిషన్ ప్రక్రియ మొదలు కాకముందే సీట్లను భర్తీ చేస్తున్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పీఆర్వోలను నియమించి సీట్లను భర్తీ చేస్తున్నారు. కనీస వసతులు లేని కళాశాలల్లో విద్యార్థులను కుక్కుతూ కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. ఒక కళాశాల అనుమతి తీసుకొని బ్రాంచీలు పెట్టి అధికారులను మేనేజ్ చేస్తూ వందలాది మంది విద్యార్థులను చేర్చుకుంటున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం అనుమతి తర్వాతనే ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు చేయాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థులను చేర్చుకోవాలి. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దరఖాస్తులను స్వీకరించి సీట్లను భర్తీ చేయాలి. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ లోపే కార్పొరేట్ జూనియర్ కళాశాలల అడ్మిషన్లు జరుగుతున్నాయి. గడిచిన 15 రోజులుగా పదవ తరగతి పరీక్షలు రాసే పిల్లల చుట్టూ కార్పొరేట్ కళాశాలల పీఆర్వోలు తిరుగుతున్నారు. కళాశాలల నుంచి నిత్యం తల్లిదండ్రులకు ఫోన్లు చేయడంతో పాటు తమ కళాశాలల్లో చేరితే ఫీజు తగ్గింపు చేస్తామని ఐఐటీ, నీట్, ఎంసెట్ ఇతర కోచింగ్ లు అందిస్తామని ఆశలు కల్పిస్తున్నారు. విద్యార్థులను కౌన్సిలింగ్ చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..