
హైదరాబాద్, 26 మార్చి (హి.స.) పరిశ్రమలు తమ సామాజిక బాధ్యత నిధుల ద్వారా గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి సహకరిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం బొల్లారం డివిజన్ పరిధిలోని ఐటీసీ పరిశ్రమ సౌజన్యంతో రూ. 32 లక్షలతో కొనుగోలు చేసిన కంప్యూటర్లు, చెత్త సేకరణ ఆటోలు, త్రీ చక్ర సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బొల్లారం పరిధిలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తెలంగాణ మోడల్ స్కూల్ పాఠశాలలకు 15 కంప్యూటర్లు, రెండు ప్రింటర్లు, బొల్లారం మున్సిపల్ విభాగానికి 8 చెత్త సేకరణ ఆటోలు, దివ్యాంగుల కోసం 3 త్రి చక్ర సైకిళ్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీసీ కంపెనీ తన సామాజిక బాధ్యతలో భాగంగా పాఠశాలల అభివృద్ధికి, బొల్లారం డివిజన్ పరిధిలో పారిశుధ్యం పెంపొందించేందుకు సహకారం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లోనూ మరిన్ని అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరారు. ప్రభుత్వం, పరిశ్రమలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిసి పనిచేస్తే అభివృద్ధి సుసాధ్యం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, మాజీ జడ్పీటీసీ బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి, రవీందర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, లక్ష్మా రెడ్డి, ఐటీసీ సంస్థ జనరల్ మేనేజర్ శ్రీనివాస్, ప్లాంట్ హెడ్ సుబ్రహ్మణ్యం, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..