
ఖమ్మం, 26 మార్చి (హి.స.)
పార్లమెంటు మరియు అసెంబ్లీ స్థానాల పునర్విభజనలో భాగంగా రాష్ట్రంలో కొత్తగా అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా కొత్తగా మూడు నియోజకవర్గాలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో జనాభా లెక్కలు పూర్తి కాగానే పునర్విభజన కసరత్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగా మూడు నియోజకవర్గాలు పెరుగుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకుల ఆశలు చిగురిస్తున్నాయి.
ఖమ్మం జిల్లాలోని ఖమ్మం నియోజకవర్గంలో సుమారు 5.25 లక్షల సగటు జనాభా ఉందని లెక్కల ప్రకారం తెలుస్తోంది. 2.30 లక్షల సగటు జనాభాకు నియోజకవర్గం ఏర్పాటు అయితే ఖమ్మం నియోజకవర్గం రెండు నియోజకవర్గాలు ఏర్పాటు కానుంది. కొత్తగా రఘునాథపాలెం నియోజకవర్గం ఏర్పాటు అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున 2.30 జనాభా ఉండనుంది. అయితే కొత్తగా రఘునాథ పాలెం మండలం, కార్పొరేషన్లో గ్రామాలు విలీనం కావడంతో ఖమ్మం నియోజకవర్గంలో సుమారు 5.20 లక్షల జనాభా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఒక నియోజకవర్గం ఏర్పాటు అయితే సుమారు 2.30 లక్షల సగటు జనాభా తో నియోజకవర్గం ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం, పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం, ఇల్లెందు, నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాలో 23 మండలాలు ఉన్నాయి. ఒక్క జూలూరుపాడు మండలం మాత్రం ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గంలో కలిసి ఉంది. ఇక జిల్లాలో కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలో కొత్తగూడెం, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాలు ఉండగా, పినపాక పరిధిలో పినపాక, అశ్వాపురం, మణుగూరు, బూర్గంపాడు, కరకగూడెం, ఆళ్లపల్లి, గుండాల, అశ్వారావుపేట పరిధిలో అశ్వారావుపేట, ములకలపల్లి, దమ్మపేట, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, భద్రాచలం పరిధిలో భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, వెంకటపురం, వాజేడు (ములుగు జిల్లా), ఇల్లెందు పరిధిలో ఇల్లెందు, టేకులపల్లి, కామేపల్లి (ఖమ్మం జిల్లా), బయ్యారం, గార్ల (మహబూబాబాద్ జిల్లా) మండలాల్లో నియోజకవర్గాలు విస్తరించి ఉన్నాయి. అయితే ఇల్లెందు పరిధిలో కామేపల్లి ఖమ్మం జిల్లా, బయ్యారం, గార్ల మండలాలు మహబూబాబాద్ జిల్లాలో ఉన్నప్పటికీ వీటన్నింటిని కలిపి ఇల్లెందు నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. ఇక భద్రాచలం నియోజకవర్గంలో భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం మినహా, మిగిలిన రెండు మండలాలు వాజేడు, వెంకటాపురం మండలాలు ములుగు జిల్లా పరిధిలో ఉన్నాయి.
అయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సైతం జిల్లాలు శాస్త్రీయంగా విభజన జరగలేదని ఆరోపించారు. అదే విధంగా ఒక్కో నియోజకవర్గం మూడు జిల్లాలో విస్తరించి ఉండడంతో పాలనపరంగా కూడా ప్రజలు అనేక ఇబ్బందులుపడుతున్నారనీ చెప్పారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒకే జిల్లాలోని మండలాలను కలిపి నియోజకవర్గం ఏర్పాటు చేయాలని భావిస్తే ప్రజలకు ఇబ్బందులుతప్పుతాయి. అదే విధంగా నియోజకవర్గాల విషయానికి వస్తే ఇప్పటికే ఐదు నియోజకవర్గాలు ఉండగా పునర్విభజన జరిగితే అదనంగా రెండు నియోజకవర్గాలు వచ్చి చేరుతాయని అధికారులు, రాజకీయనాయకులు, విశ్లేషకులు, ఆశావాహులు అంటున్నారు.
పినపాక, 2011 జనాభా లెక్కల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనాభా 10.69 లక్షలుగా ఉంది. 2021 జనాభా లెక్కింపు ప్రక్రియ ఆలస్యం అవుతుండటంతో 2011 జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రతి నియోజకవర్గంలో దాదాపు 1.50లక్షల ఓటర్లు పైనే ఉన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో 2.400, అశ్వారావుపేటలో 2లక్షలు, ఇల్లెందులో 1.50లక్షలు, ఇక భద్రాచలం పరిధిలో 1.50పైగా జనాభా ఉంది. నియోజకవర్గాల విషయానికి వస్తే ఎక్కువ జనాభా ఉన్న మండలాల్లో కొత్తగూడెం, పాల్వంచ మండలాలు పట్టణ పరిధిలో ఉన్నాయి. జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ఉండటంతో రానున్న రోజుల్లో నియోజకవర్గాలు ఏర్పడే అవకాశాలు లేకపోలేదంటున్నారు రాజకీయవిశ్లేషకులు. ఇక బూర్గంపాడు కూడా పాత నియోజకవర్గంగా ఉండటం పినపాక నియోజకవర్గం జనాభా సైతం 2 లక్షలకు పైగానే ఉండటంతో మళ్లీ బూర్గంపాడు నియోజకవర్గ ఏర్పడే అవకాశం ఉందంటున్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..