
ఢిల్లీ, 26మార్చి (హి.స.) మధ్యప్రాచ్యం యుద్ధం ఎఫెక్ట్ ఇంధన రంగంపై పడుతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు సతమతమవుతున్నాయి. పాకిస్థాన్, నేపాల్, శ్రీలంక వంటి దేశాల్లో ఇంధన కొరత కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. తాజాగా భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ అయిన నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న సంఘర్షణ నేపథ్యంలో శుక్రవారం దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. కంపెనీ పెట్రోల్ ధరను లీటరుకు రూ. 5.30, డీజిల్ ధరను లీటరుకు రూ. 3 పెంచింది. కాగా.. నయారా ఏడాదికి 20 మిలియన్ టన్నుల సామర్థ్యంతో భారతదేశపు రెండవ అతిపెద్ద సింగిల్-సైట్ రిఫైనరీ అయిన వడినార్ ఆయిల్ రిఫైనరీని నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 6,500కు పైగా పెట్రోల్ పంపులను కలిగి ఉంది. గతేడాది 450,000 టన్నుల పాలీప్రొపీలిన్ ప్లాంట్తో పెట్రోకెమికల్స్ రంగంలోకి ప్రవేశించింది. నయారా ఎనర్జీని గతంలో ఎస్సార్ ఆయిల్ అని పిలిచేవారు. 2017లో రష్యాకు చెందిన రోస్నెఫ్ట్, ట్రాఫిగురా, యూసీపీ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ల కన్సార్టియం కలిసి ఎస్సార్ ఆయిల్ను 12.9 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశాయి. ఆ తర్వాత ఆ సంస్థకు నయారా ఎనర్జీ అని పేరు మార్చారు.
మరోవైపు.. ఇరాన్ యుద్ధం కారణంగా అక్కడి నుంచి వచ్చే ముడి చమురు నెల రోజులుగా అందడం లేదు. గల్ఫ్ దేశాల నుంచి ముడి చమురు రవాణాకు అంతరాయం కలగడంతో దేశానికి ముడి చమురు సరఫరా నిలిచిపోయింది. అయినప్పటికీ దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు. ఎందుకంటే.. రష్యా వంటి దేశాల నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ