
దిల్లీ 27 మార్చి (హి.స.): విమానయాన సంస్థలు సులభంగా వ్యాపారం చేసుకునేందుకు, అవి వృద్ధి చెందేందుకు తగిన మద్దతు ఇస్తున్నామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) పేర్కొంది. ప్రయాణికుల హక్కుల పరిరక్షణకూ తగిన చర్యలు తీసుకుంటున్నామని డీజీసీఏ అధిపతి ఫయాజ్ అహ్మద్ కిద్వాయ్ పేర్కొన్నారు. యుద్ధాల కారణంగా కొన్ని దేశాలు గగనతల ఆంక్షలు విధించడంతో, అంతర్జాతీయ మార్గాల్లో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి రావడం, విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరతో పాటు కార్యకలాపాల వ్యయాలు పెరగడం వంటి సవాళ్లను విమానయాన కంపెనీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్నాయన్నారు.
త్వరలో మంచి రోజులు రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత పౌర విమానయాన మార్కెట్ వృద్ధి కోసం డీజీసీఏ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పలు చర్యలు తీసుకుంటున్నాయి. డిసెంబరులో ఇండిగో విమాన కార్యకలాపాలకు పెద్దఎత్తున అంతరాయం ఏర్పడిన సందర్భాల్లో, ఇతర సంస్థల విమాన టికెట్ల ధరలు మరీ పెరగకుండా విధించిన గరిష్ఠ పరిమితి ఆంక్షలను ఇటీవల సంస్థ తొలగించింది కూడా.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ