
అమరావతి, 27 మార్చి (హి.స.) తరచూ మార్పు చేయకుండా అమరావతిని శాశ్వత రాజధానిగా ఉంచేందుకు శాసనసభలో తీర్మానం చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధిని కూడా దృష్టిలో ఉంచుకుని సీఎం చంద్రబాబు నాయకత్వంలో సమావేశమైన మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది.
దీనికోసం ఏపీ పునర్విభజన చట్టం- 2014లోని సెక్షన్ 5ను సవరించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేయాలని నిర్ణయించింది. సెక్షన్ 5లోని సబ్ సెక్షన్ (2)లో ‘అమరావతి వద్ద’ అనే పదాన్ని చేర్చాలని, సెక్షన్ 5కు వివరణలో ‘మరియు అమరావతి అనగా, ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీ సీఆర్డీఏ) చట్టం-2014 కింద నోటిఫై చేయబడిన రాజధాని నగర ప్రాంతాలు కూడా కలిసి ఉంటాయి’ అనే పదాలను కలపాలని కూడా నిర్ణయించింది. ఇలా క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ