
ఆత్రేయపురం, 27 మార్చి (హి.స.), కోనసీమ తిరుమలగా వెలుగొందుతున్న వాడపల్లి వేంకటేశ్వరస్వామి తీర్థం, కల్యాణోత్సవాలు ఈ నెల 28 నుంచి వారం రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు. శనివారం ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. స్వామి రథోత్సవం ఆదివారం మధ్యాహ్నం 3, కల్యాణం రాత్రి 7 గంటలకు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం ఛైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. భక్తులకు తాగునీటి సదుపాయం తదితర ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనుంది. రహదారులు, కల్యాణ వేదిక, వాహనాల ప్రాంగణాలను ఇప్పటికే తీర్చిదిద్దారు.
ఇక్కడి స్వామివారి రథోత్సవానికి ఓ ప్రత్యేకత ఉంది. 1931లో రథోత్సవం జరుగుతుండగా రథం మీద ఉంచిన గాంధీ చిత్రపటాన్ని, త్రివర్ణపతాకాన్ని బ్రిటిష్ పాలకులు తొలగించారు. దీంతో వారిని ఎదురించి తుపాకీ గుళ్లకు బలై పలువురు దేశభక్తులు అసువులు బాశారు. అందుకే ఇక్కడ రథోత్సవ కార్యక్రమానికి ప్రత్యేకత ఏర్పడింది.
:28న అంకురార్పణ, ధ్వజారోహణ, 29న ఎదుర్కోలు ఉత్సవం, రథోత్సవం, రాత్రి 7 గంటలకు కల్యాణం, 30న పొన్నవాహన మహోత్సవం, 31న మహదాశీర్వచనం, సదస్యం, ఏప్రిల్ 1న తెప్పోత్సవం, 2న మహా పూర్ణాహుతి, చక్రస్నానం, ధ్వజావరోహణ, 3న శ్రీపుష్పోత్సవం (పవళింపు సేవ)తో ఉత్సవాలు ముగుస్తాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ