
భద్రాచలం, 27 మార్చి (హి.స.)
భద్రాద్రిలో శ్రీ సీతారాములవారి కల్యాణోత్సవం కన్నుల పండువగా, అంగరంగ వైభవంగా జరిగింది. వేదమంత్రోచ్ఛారణ నడుమ సాగిన రాములోరి కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు భారీగా హాజరయ్యారు. ఆద్యంతం శ్రీరామ నామంతో భద్రగిరి మారుమ్రోగుతోంది. మిథిలా స్టేడియం వైకుంఠాన్ని తలపించగా....... ప్రత్యేకంగా అలంకరించిన శిల్పకళా శోభితమైన కళ్యాణ మండపంలో నిర్వహించిన రామయ్య కళ్యాణం చూసి భక్తులు భక్తి పారవస్యంతో పులకించిపోయారు.
కాగా.. సీఎం రేవంత్ రెడ్డి సతీసమేతంగా భద్రాద్రికి విచ్చేశారు. స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ దంపతులు, దేవాదాయశాఖ మంత్రి కొండాసురేఖ సీఎం వెంట వచ్చారు. అనంతరం మండపంలోని భక్తులకు దేవస్థానం పండితులు కల్యాణ ప్రాసస్థ్యం ను వివరించారు. తొలుత భద్రాచలంలో రూ.351 కోట్ల అభివృద్ధిపనులకు సీఎం, మంత్రులు శంకుస్థాపన చేశారు. భద్రాద్రి రామాలయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం నిర్వహించి రామయ్యకు అభిముఖంగా సీతమ్మ వారిని ఆసీనులను చేశారు. ప్రవరణ, మోక్షబంధనం, యజ్ఞోపవీతం, వర పూజ, స్వామి వారికి ప్రత్యేక అలంకారాలు నిర్వహించి మధుపర్కాలు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తరామదాసు చేయించిన పచ్చల పతకం వరుడైన రామయ్యకు, చింతాకు పతకం వధువు సీతమ్మకు, శ్రీరామమాడను లక్ష్మణ స్వామికి అలంకరింపజేశారు. సరిగ్గా 12 గంటలకు భక్తుల జయ జయ ధ్వానాల మధ్య అభిజిత్ లగ్నంలో వధూవరుల శిరస్సుపై జీలకర్ర బెల్లం ఉంచారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు