
యూ.పీ, 28 మార్చి (హి.స.)
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త
పరిస్థితుల నేపథ్యంలో చమురు, ఇంధనం, ఎల్పీజీ సప్లై సరిగ్గా లేక దేశ ప్రజలు ఇప్పటికే ఇబ్బందిపడుతున్నారు. ప్రస్తుతానికి అవన్నీ సరిపడా నిల్వలున్నాయని, మరో 60 రోజులవరకూ ఏం డోకా లేదని కేంద్రం చెప్తోంది. ఎప్పుడేం జరుగుతుందోనని ప్రజలు భయపడుతున్న వేళ.. విపక్షాలు దుష్ట రాజకీయాలు చేయొద్దని ప్రధాని నరేంద్రమోదీ విజ్ఞప్తి చేశారు. శనివారం నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారత్ లో అభివృద్ధి ఆటంకం లేకుండా జరుగుతోందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో దేశ అభివృద్ధి కొనసాగుతుందన్నారు. అంతర్జాతీయంగా సంక్షోభం నెలకొన్నా.. భారత్ తలెత్తుకుని నిలబడిందన్నారు. వికసిత్ భారత్ కోసం మౌలిక వసతుల్ని ఆధునికీకరిస్తున్నామని ప్రధాని తెలిపారు. ఇప్పటి వరకూ దేశంలో మౌలిక వసతుల కోసం రూ.17 లక్షల కోట్లను ఖర్చుచేశామని వెల్లడించారు. దేశంలో ఉన్న రైల్వే లైన్లలో 40 వేల కిలోమీటర్ల మేర విద్యుదీకరణ చేశామని వివరించారు. అలాగే ఎన్డీయే హయాంలో పోర్టుల సంఖ్య రెండింతలు పెరిగిందన్నారు. వికసిత్ భారత్ కోసం ప్రతిఒక్కరూ ముందుకురావాలని ప్రధాని పిలుపునిచ్చారు.
నిన్న జరిగిన ముఖ్యమంత్రులతో సమావేశంపై కూడా మోదీ స్పందించారు. ప్రస్తుతం ఉన్న సంక్షోభాన్ని అందరం కలిసి సమర్ధవంతంగా ఎదుర్కొందామని సీఎంలను కోరినట్లు ప్రధాని చెప్పారు. ఇది దేశానికి కష్టకాలమని, ఈ సమయంలో విపక్షాలు దుష్ట రాజకీయాలు చేయొద్దని కోరారు. దేశానికి నష్టం కలిగించే పనులు చేయొద్దని కోరారు. అలాంటివి చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. ప్రస్తుతం దేశంలో సంక్షోభాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నామని, సామాన్యులు, ప్రజలపై భారంగా లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు