
హైదరాబాద్, 28 మార్చి (హి.స.) మహానగర రవాణా వ్యవస్థలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పటివరకు ప్రైవేట్ భాగస్వామ్యం (L&T)తో నడుస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టును ప్రభుత్వం పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో మెట్రో రైలు ఇకపై పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఆస్తిగా మారిపోనుంది. నగరవాసుల చిరకాల వాంఛ అయిన మెట్రో విస్తరణకు ఉన్న అడ్డంకులను తొలగించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సాహసోపేతమైన అడుగు వేసింది.
హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌లో మెట్రో నెట్వర్క్‌ను భారీగా విస్తరించాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రణాళికలను సిద్ధం చేసింది. అయితే ప్రస్తుతం ఫేజ్-1 ప్రైవేట్ నిర్వహణలో ఉండటం వల్ల, కొత్తగా చేపట్టబోయే ఫేజ్-2 పనులకు అనేక సాంకేతిక , చట్టపరమైన అడ్డంకులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన కొన్ని నిబంధనలను పరిష్కరించాలన్నా, మెట్రో విస్తరణ వేగంగా జరగాలన్నా మొత్తం నెట్వర్క్ ప్రభుత్వ ఆధీనంలో ఉండటం అత్యవసరమని ముఖ్యమంత్రి సభలో వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు