
హైదరాబాద్, 27 మార్చి (హి.స.)
హైదరాబాద్ నగరంలో గత మూడు రోజులుగా పెట్రోల్ బంకుల వద్ద కొనసాగిన రద్దీ.. నేడు పూర్తిగా తగ్గిపోయింది. దీంతో కొద్ది రోజులుగా నెలకొన్న ఉద్రిక్తత తగ్గిపోయి వాహనదారులకు పెద్ద ఊరట లభించింది. సోషల్ మీడియాలో వచ్చిన వదంతులు, అంతర్జాతీయంగా ఇరాన్-అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధ పరిణామాల నేపథ్యంలో చమురు కొరత ఏర్పడవచ్చనే భయంతో ప్రజలు ఒక్కసారిగా బంకులకు పోటెత్తారు. దీనివల్ల నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించిపోవడమే కాకుండా, అనేక బంకుల్లో స్టాక్ అయిపోయి 'నో స్టాక్' బోర్డులు వెలిశాయి. అయితే, ప్రభుత్వం, చమురు సంస్థలు రంగంలోకి దిగి తగినన్ని నిల్వలు ఉన్నాయని భరోసా ఇవ్వడంతో పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది.
కాగా రాష్ట్రంలో దాదాపు 60 రోజులకి సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేయడమే కాకుండా.. చర్లపల్లి ఐఓసి (IOC) డిపో నుండి నిరంతరాయంగా ట్యాంకర్ల ద్వారా సరఫరా జరుగుతోందని అధికారులు ధ్రువీకరించారు. గత రెండు రోజుల్లో పెట్రోల్ అమ్మకాలు సాధారణం కంటే మూడు రెట్లు పెరిగాయని, దీనివల్ల ట్యాంకర్లు సకాలంలో రాక కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదురయ్యాయని, ఇప్పుడు సరఫరా పునరుద్ధరించబడటంతో అన్ని బంకుల్లో ఇంధనం అందుబాటులోకి వచ్చిందని డీలర్లు తెలిపారు.
యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల నుండి చమురు ఆగిపోతుందనే తప్పుడు ప్రచారాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. వదంతులు వ్యాప్తి చేసే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. బంకుల వద్ద శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు
పోలీసులను మోహరించడం, క్రమపద్ధతిలో ఇంధనం నింపేలా చర్యలు తీసుకోవడం వల్ల గందరగోళం తగ్గింది. ప్రజలు కూడా పరిస్థితిని అర్థం చేసుకుని, అవసరమైనంత మేరకే ఇంధనాన్ని నింపుకోవడంతో క్యూ లైన్లు మాయమయ్యాయి. ఇక హైదరాబాద్లో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటరుకు సుమారు రూ.107.46, డీజిల్ ధర రూ. 95.70 వద్ద స్థిరంగా ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు