
హైదరాబాద్, 27 మార్చి (హి.స.) రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలే ఎక్కువగా ఉన్నా అత్యధికమంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలోనే చదువుతున్నట్లు తాజాగా వెల్లడైంది. తెలంగాణలో మొత్తం 39,641 స్కూళలో 62,36,000 మంది విద్యార్థులుండగా అందులో 24,214 ప్రభుత్వ పాఠశాలల్లో 16,61,520 మంది, 12 వేల ప్రైవేట్ స్కూళ్లలో 37.43 లక్షల మంది విద్యను అభ్యసిస్తున్నట్లు సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ 2026 సర్వే వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల వివరాలను పరిశీలించిన సర్వే.. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో పాఠశాలలు ప్రభుత్వ, స్థానిక సంస్థల ఆధ్వర్యంలోనే నడుస్తున్నట్లు పేర్కొంది. అదేవిధంగా బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంలో గురుకులాలు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపింది.
పాఠశాలల సంఖ్య పరంగా ప్రభుత్వ స్కూళ్లదే అగ్రస్థానం. అయినప్పటికీ విద్యార్థుల నమోదులో ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలలు గణనీయమైన వాటాను కలిగి ఉన్నాయి. పేద, వెనుకబడిన వర్గాల పిల్లలకు విద్యను నిరంతరం అందుబాటులో ఉంచడంలో గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ముందు వరుసలో ఉన్నాయి.
రాష్ట్రంలోని గవర్నమెంట్, ప్రైవేటు స్కూళ్లు దాదాపు 40 వేల వరకు ఉండగా కేవలం 63.3 శాతం స్కూళ్లలోనే ఇంటర్నెట్ సౌకర్యం ఉందని యుడైస్ 2024-25 సర్వే వెల్లడించింది. చిన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల కంటే వెనకబడి తెలంగాణ 23వ స్థానంలో నిలిచింది. లక్ష్యద్వీప్, ఢిల్లీ, ఛత్తీష్తోఢ్ పాటు పలు రాష్ట్రాల్లో వందశాతం స్కూళ్లలో ఇంటర్నెట్ ఉంది. బిహార్ 84.8 శాతం నెట్ సౌకర్యం ఉండి తెలంగాణ కంటే మెరుగైన స్థానంలో ఉంది. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు అనుకూలంగా ఉండే టాయిలెట్ల నిర్మాణంలో తెలంగాణ చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు