
షాద్నగర్, 27 మార్చి (హి.స.)
అక్రమంగా భారీ కంటైనర్లలో ఆవులను తరలిస్తున్న రెండు కంటైనర్లను హిందూ వాహిని, భజరంగ్దళ్ సభ్యులు గురువారం రాత్రి పట్టుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా పట్టణ ముఖ్య కూడలిలో తోరణాలను కడుతున్న హిందు వాహిని సభ్యులకు మూడు కంటైనర్లు అనుమానాస్పదంగా కనిపించాయి. కంటైనర్ డ్రైవర్లను ప్రశ్నించేందుకు ప్రయత్నించగా కంటైనర్లను ఆపకుండా డ్రైవర్లు అతివేగంగా తీసుకెళ్లారు. కంటైనర్లను వెంబడించిన హిందూ వాహిని, భజరంగ్దళ్ సభ్యులు తమ ద్విచక్ర వాహనాలతో వెంబడించి రెండు కంటైనర్లను పట్టుకోగా, ఒక కంటైనర్ వెళ్లిపోయింది.
పట్టుకున్న రెండు కంటైనర్లోని 48 ఆవులను షాద్ నగర్ మున్సిపాలిటీలోని చౌడమ్మ గుట్ట గోశాలకు తరలించారు. ఆవులు తరలిస్తున్న కంటైనర్లను హిందూ వాహిని సభ్యులు పట్టుకున్నారన్న విషయం తెలుసుకున్న ఫరూఖ్ నగర్ కు చెందిన మరో వర్గం భారీగా గోశాల వద్దకు చేరడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి తోపులాటలకు పాల్పడడంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా షాద్ నగర్ ఏసిపి లక్ష్మీనారాయణ పర్యవేక్షిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు