
హైదరాబాద్, 27 మార్చి (హి.స.)
తెలంగాణ రాజకీయాల్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ పార్టీపై బిగ్ అప్డేట్ ఇచ్చారు.
శ్రీరామనవమి వేళ ఈ కీలక ప్రటకన చేశారు. వచ్చే ఏప్రిల్ 25వ తేదీన కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. ఆరోజే పార్టీ పేరు, జెండా ఆవిష్కరణ ఉంటుందని వెల్లడించారు. మేడ్చల్ మునీరాబాద్ గ్రామంలోని అద్వయ కన్వెషన్లో నిర్వహించే పార్టీ ఆవిర్భావ సభకు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. మార్పు కోరుకునే అభ్యుదయ వాదులు అందరూ తనతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. శ్రీరాముడి దయతో అందరినీ కలుపుకొని పోతామని హామీ ఇచ్చారు. తన మెట్టినిల్లు అయిన నిజామాబాద్లోని జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ ప్రకటన చేశారు. అనంతరం ఖిల్లా రామాలయంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కొత్త తరం నాయకత్వానికి, మహిళా సాధికారతకు పార్టీలో పెద్దపీట వేయనున్నట్లు కవిత వెల్లడించారు. అయితే.. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మరియు బీఆర్ఎస్ వర్గాల్లో ఈ కొత్త పార్టీ ప్రభావంపై ముమ్మర చర్చ సాగుతోంది. తెలంగాణ సెంటిమెంట్తో పాటు సాంస్కృతిక మూలాలను బలంగా విశ్వసించే కవిత, ఈ పార్టీ ద్వారా ప్రజల్లోకి ఎలా వెళ్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు