
నిజామాబాద్, 27 మార్చి (హి.స.)
రాష్ట్రవ్యాప్తంగా శ్రీరామ నవమి
వేడుకలు అట్టహాసంగ జరిగినవి. ఉదయం నుంచే రామాలయాలన్నీ భక్తుల 'జైశ్రీరామ్' నినాదాలతో మారుమోగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ పట్టణంలోని చారిత్రాత్మక శ్రీ రఘునాథ ఆలయం (ఖిల్లా రామాలయం)లో సీతారాముల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా, కన్నుల పండువగా జరిగింది. ఈ రమణీయ వేడుకలో ఓ ఆసక్తికరమైన దృశ్యం చోటుచేసుకుంది. లోకకళ్యాణం కోసం జరిగిన ఈ క్రతువులో రాజకీయాలకు అతీతంగా ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత, ఆమె భర్త దేవనపల్లి అనిల్ దంపతులు పెళ్లికూతురు సీతమ్మ తల్లి తరపున నిలిచి కళ్యాణాన్ని జరిపించారు. ఇక పెళ్లికొడుకు రామయ్య తండ్రి తరపున టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఉండి ఈ పవిత్ర కార్యంలో పాలుపంచుకున్నారు.
కళ్యాణోత్సవం సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్, కవిత-అనిల్ దంపతులు స్వామి వారికి పట్టువస్త్రాలు, మెరిసిపోయే ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య జరిగిన ఈ వేడుకను చూసేందుకు వచ్చిన భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు, వడపప్పుతో పాటు బెల్లం పానకాన్ని పంపిణీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..