
అమరావతి 28 మార్చి (హి.స.), రాష్ట్రంలోని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా శాఖ కొత్త నిబంధనలు విడుదల చేసింది. ఈ నిబంధనల ప్రకారం కోచింగ్ సెంటర్లు రోజుకు గరిష్ఠంగా 5 గంటలు మాత్రమే తరగతులు నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖ స్పష్టం చేసింది. పాఠశాలలు, కాలేజీలు నడిచే సమయంలో, సెలవు రోజుల్లో కోచింగ్ తరగతులు నిర్వహించకూడదని పేర్కొంది. విద్యార్థులకు వారానికి ఒక రోజు(ఆదివారం) తప్పనిసరి సెలవు ఇవ్వాలనే నిబంధనను విధించింది.
విద్యార్థి మధ్యలో కోర్సు మానేస్తే, మిగిలిన రోజుల ఫీజును తిరిగి చెల్లించాలని తెలిపింది. అలాగే విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను కోచింగ్ సెంటర్లు తమ వద్ద ఉంచుకోకూడదని స్పష్టం చేసింది. 50 మందికి పైగా విద్యార్థులు ఉన్న సెంటర్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘిస్తే మొదటిసారి రూ.50 వేలు జరిమానా, రెండవసారి రూ. లక్ష జరిమానా విధించనున్నారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం ఎస్పీ, డీఈవోలతో కమిటీని ఏర్పాటు చేయనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ