బయో గ్యాస్ వంటకు.భరోసా
బయోగ్యాస్ ద్వారా వంటలు
బయో గ్యాస్ వంటకు.భరోసా


అమరావతి, 28 మార్చి (హి.స.)

తవణంపల్లె, పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడుతోంది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కొరతతో కొందరు దుకాణాలు మూసేస్తున్నారు. గ్యాస్ అనుకున్న సమయానికి ఇంటికి రాకపోవడంతో గృహిణులకు సైతం అవస్థలు తప్పడం లేదు. తవణంపల్లె మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలు మాత్రం భయం లేకుండా బయోగ్యాస్ వినియోగంతో వంట చేసుకుంటున్నారు.

గళ్లావాళ్లవూరు, ఎగువమత్యం, మత్యం, టి.పుత్తూరు ఒడ్డుపల్లె, ముట్టుకూరు గొల్లపల్లి మొదలైన గ్రామాలలో చాలా మంది ఇంటి వద్ద నెడ్క్యాప్ సంస్థ ద్వారా రాయితీతో బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నారు.

బయోగ్యాస్ ద్వారా వంటలు వండుకుని జీవనం సాగిస్తున్నారు. పశువుల పేడే దీనికి ఇంధనంగా పనిచేస్తుందని, రోజుకు రెండు తట్టల పశువుల పేడను నీటితో కలిపి ప్లాంటు వద్ద ఏర్పాటు చేసుకున్న తొట్టెకు నింపితే రోజుకు ఆరుగురు వ్యక్తులకు సరిపడా గ్యాస్ను వినియోగించుకోవచ్చని చెబుతున్నారు. ఇంటి వద్ద పశువులు ఉన్నవారు బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటే అన్ని విధాలా లాభాలు ఉంటాయని వినియోగదారులు చెబుతున్నారు. కాగా బయోగ్యాస్ సర్వీసులను ప్రస్తుతం నిలిపివేయగా.. పునరుద్ధరిస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.

బయోగ్యాస్ ప్లాంట్ను 2009 సంవత్సరంలో రాయితీ కింద ఏర్పాటు చేసుకున్నాం. అప్పటి నుంచి బయోగ్యాస్నే వినియోగిస్తున్నాం. ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంది. వంట తయారీకి ఎటువంటి ఇబ్బందులు లేవు. కట్టెలు, సిలిండర్ల కోసం అవస్థలు పడాల్సిన అవసరం లేదు. బయోగ్యాస్కు రోజూ పశువుల పేడ వాడాలి.

జమున, ఎగువమత్యం, గృహిణి

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande