
మంగళగిరి, 28 మార్చి (హి.స.) బైపాస్ ప్రయాణంలో తికమక దంపతుల ప్రాణాన్ని బలితీసుకుంది. పండగ రోజు కుమార్తె ఇంటికి వెళ్లి..అక్కడి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ తిరిగివస్తున్న భార్యాభర్తల బంధాన్ని మృత్యువు కబళించింది. మంగళగిరి గ్రామీణం పోలీసులు తెలిపిన వివరాల మేరకు...మంగళగిరికి చెందిన కారంపూడి నాగేశ్వరరావు(65), ధనలక్ష్మి (57) దంపతులకు ఇద్దరు సంతానం. గతంలో మగ్గం వర్క్ పనిచేసే వారు. ప్రస్తుతం వయసు రీత్యా ఇంట్లోనే ఉంటున్నారు. శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం కుమార్తె ఇంటికి గుంటూరు వెళ్లారు. మధ్యాహ్నం తరువాత ద్విచక్రవాహనంపై మంగళగిరి బయలుదేరారు.
చినకాకాని ఉన్నత పాఠశాల సమీపంలో నూతనంగా నిర్మించిన విజయవాడ బైపాస్లోకి ప్రవేశించారు. కొద్ది దూరం ముందుకెళ్లాక దారి తప్పామని గమనించి మంగళగిరి వైపు వెళ్లేందుకు వెనక్కి వస్తుండగా.. వేగంగా వస్తున్న ప్యాసింజర్ వ్యాను (టాటా ఏస్)ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులిద్దరూ కింద పడిపోవడంతో వారి తలలకు బలమైన గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను పోలీసులు ఎయిమ్స్కు తరలించారు. కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ