
కాకినాడ 28 మార్చి (హి.స.), ఆన్లైన్ గేమ్స్కు అలవాటుపడిన ఓ విద్యార్థి అప్పులు చేశాడు. వాటిని తీర్చలేక బతుకు ముగించాలనుకున్నాడు. తల్లికి లేఖరాసి హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాలోని నావ్పాడకు చెందిన మహ్మద్ బషీర్(22) జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఓ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆన్లైన్ గేమ్స్కు అలవాటుపడి.. పలు ఆన్లైన్ యాప్స్లో అప్పు తీసుకుని చెల్లించలేకపోయాడు.
దీంతో మనస్తాపానికి గురై గురువారం సాయంత్రం హాస్టల్లో ఫ్యాన్కు ఉరేసుకుని మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బషీర్కి ఇద్దరు తమ్ముళ్లు. తండ్రి షమీర్ఖాన్, తల్లి పర్వీన్ బేగమ్ చిన్నచిన్న వ్యాపారాలు చేస్తుంటారు. బషీర్ చిన్నప్పటి నుంచి అనకాపల్లి జిల్లా వడ్డాది మాడుగులలోని అమ్మమ్మ వద్ద ఉండి చదువుకునే వాడని పోలీసులు చెప్పారు.:‘అమ్మా సారీ. నిన్ను చాలా ఇబ్బంది పెట్టా. నువ్వు నన్ను చాలా ప్రేమించావు. నేను నీకు సరైన ఆనందం ఇవ్వలేకపోయా. చిన్నప్పటి నుంచి నా జీవితం సరిగా లేదు. నాన్నకి ఫోన్ చేస్తే సమస్యలు వచ్చేవి. నేను ఏం చేసినా సరిగ్గా జరగలేదు.
నువ్వు నా కోసం ఎంత కష్టపడ్డావో తెలుసు. నేను నీకు ఉపయోగపడేలా జీవించలేకపోయా. ఇప్పుడు బతికి ఉన్నా నీకు భారంగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఏమి చేయాలో అర్థం కావడం లేదు. అమ్మా క్షమించు.. మంచి కొడుకుగా ఉండలేకపోయా. చాలా ఆలోచించా. నాకు సరైన మార్గం కనిపించడం లేదు. నువ్వు బాధపడతావని తెలుసు. ఐలవ్యూ అమ్మా అని లేఖ రాసి మృతి చెందడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ