
కరీంనగర్,28 మార్చి (హి.స.)
తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆశా వర్కర్లు శనివారం హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడికి తరలిన నేపథ్యంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద పోలీసులు వారిని అడ్డుకోవడం స్వల్ప ఉద్రిక్తతకు కారణం అయింది. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అసెంబ్లీ ముట్టడికి బస్సులలో వెళ్తున్న ఆశా వర్కర్లను రేణికుంట టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆశాకార్యకర్తలు రహదారి పై నిలబడి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆశావర్కర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని కరీంనగర్ పీటీసీ సెంటర్ కి తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపడానికి వెళ్తున్న తమను అడ్డుకోవడం ఏంటని ఆశా కార్యకర్తలు పోలీసులను ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన విరమించేది లేదని ఆశా కార్యకర్తలు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు