
భద్రాచలం, 28 మార్చి (హి.స.)
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో వసంత పక్ష ప్రయుక్త శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా మిథిలా స్టేడియంలోని కళ్యాణ మండపంలో శ్రీరామ నవమి నాడు సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరగగా, అదే వేదికపై చైత్ర శుద్ధ దశమి పుష్యమి శనివారం రామయ్యకు మహా పట్టాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. పట్టాభిషేకం జరుగుతుండగా రామయ్య రాజసం చూసి భక్తులు పరవశించిపోయారు. ఈ ఉత్సవానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్ల రాజ్యాధికారి హోదాలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రామాలయంలో ఉదయం నిత్య విధులు అనంతరం 10 గంటలకు మిథిలా స్టేడియంలోని ప్రాకార మండపంలో స్వామివారి ఉత్సవ మూర్తులను వేంచేపు చేసి అలంకార ఆరాధన గావించి, నిర్విఘ్నతాసిద్ధి కొరకు శ్రీవిశ్వక్సేనార్చన, ద్రవ్య శుద్ధి కొరకు పుణ్యాహవచనం నిర్వహించారు.
అనంతరం పుణ్యాహ జలములతో పట్టాభిషేక ప్రక్రియ ప్రారంభించారు. ఈ సందర్భంగా మండపారాధన గావించి, మండపంలో ముందుగా చతుస్సముద్రోదక కలశాలను, మధ్యలో 500 నదుల తీర్థ కలశాలను (శ్రీమద్రామాయణంలో పేర్కొన్న విధంగా) స్థాపించి అర్చించి, పట్టాభిషేక సర్గ పారాయణం నిర్వహించారు. తదనంతరం కలశోదకములతో పట్టాభిషేక మంత్ర పఠన పూర్వకంగా స్వామివారికి పట్టాభిషేకం నిర్వహించి, స్వర్ణ కిరీటం, పాదుకలు, హారాలు, ఛత్ర-చామరాది లాంఛనాలను సమర్పించారు. నివేదన గావించి మంగళ నీరాజనంతో పట్టాభిషేకం కార్యక్రమాన్ని ముగించారు. అనంతరం భక్తుల పై మంత్ర జలాన్ని చిలకరించారు. ఈ రోజు రాత్రి స్వామివారికి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు