
హైదరాబాద్, 28 మార్చి (హి.స.) రాష్ట్రంలోని సర్కారు దవాఖానాల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేయడంతో పాటు, పాలనాపరమైన సంస్కరణలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇకపై ఆస్పత్రుల పర్యవేక్షణ, నిర్వహణ బాధ్యతలను క్లినికల్ సేవల నుంచి పూర్తిగా వేరు చేయాలని సర్కారు భావిస్తోంది. వైద్యులు రోగులకు చికిత్స అందించడంపైనే పూర్తిస్థాయిలో దృష్టి సారించేలా, అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలను ప్రత్యేక నిపుణులకు అప్పగించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు వైద్య విధాన పరిషత్, డీఎంఈ పరిధిలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గురువారం అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఆస్పత్రి నిర్వహణలో డాక్టర్ల ప్రమేయాన్ని తగ్గించి, ఎండీ (హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్) నిపుణులు లేదా ప్రత్యేక అధికారులను నియమించడం ద్వారా పేదలకు వేగవంతమైన, నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేస్తోంది. వైద్య కళాశాలలు, ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణలో విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ఆస్పత్రి పాలనను క్లినికల్ సేవల నుంచి వేరు చేస్తూ, ప్రత్యేక అధికారులకు అప్పగించాలనే ప్రతిపాదనపై సీఎం అసెంబ్లీలో స్పష్టతనిచ్చారు.
గతంలో ఆస్పత్రి పరిపాలన కోసం ప్రత్యేక కోర్సులు లేకపోవడంతో ఆర్ఎంఓ, సూపరింటెండెంట్ వంటి పదవులను సీనియర్ వైద్యులే నిర్వహించేవారు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా శిక్షణ పొందిన హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్లు అందుబాటులో ఉండటంతో డీఎంఈ పరిధిలో త్వరలోనే నియామక ప్రక్రియలో మార్పులు రానున్నాయి. దీనివల్ల అటు రోగులకు నాణ్యమైన వైద్యం అందడంతో పాటు, ఇటు ఆస్పత్రి నిర్వహణలోనూ జవాబుదారీతనం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు