ఉపాధి పని కల్పించడంలో విఫలమైన కాంగ్రెస్: కేంద్ర మంత్రి బండి సంజయ్
రాజన్న సిరిసిల్ల, 28 మార్చి (హి.స.) ఉపాధి హామీ పని కల్పించడంలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలం చెందిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. శనివారం సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లె గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన
బండి సంజయ్


రాజన్న సిరిసిల్ల, 28 మార్చి (హి.స.) ఉపాధి హామీ పని కల్పించడంలో

రేవంత్ రెడ్డి సర్కార్ విఫలం చెందిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. శనివారం సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లె గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన రూ.25 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంకిరెడ్డిపల్లెలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 125 రోజుల పాటు పని కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్ జీ పథకాన్ని తీసుకొచ్చినా... తెలంగాణలో ఆశించిన విధంగా పని దినాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు.

దేశవ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలను ధార్మిక చింతనతో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఏ గ్రామం వెళ్లినా.. ఏ ఆలయం వెళ్లినా సీతారామచంద్రస్వామి కళ్యాణ వేడుకలతో కళకళలాడాయన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద గత ఏడాది నా పార్లమెంట్ నియోజకవర్గంలో 32 కోట్ల 13 లక్షల రూపాయలు ఖర్చు చేసి రోడ్లను నిర్మించామన్నారు. ఇప్పటి వరకు దాదాపు 700 కోట్ల రూపాయల నిధులను మన పార్లమెంట్ పరిధిలో ఖర్చు చేశామన్నారు. ఈసారి 2026-27 కేంద్ర బడ్జెట్లో జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకొచ్చిన వీబీ జీ పథకానికి 95 వేల 692 కోట్లను కేటాయించామన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్ లో ఈ ఒక్క పథకానికే 40 శాతం నిధులు కేటాయించామన్నారు.

రాష్ట్రంలో సుమారు 32 లక్షల జాబ్ కార్డ్ హోల్డర్లు ఈ పథకం కింద లబ్ది పొందుతున్నారని, ఏటా 125 రోజులపాటు పని కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తెచ్చామన్నారు. కానీ తెలంగాణలో ఆశించిన విధంగా పని దినాలు కల్పించడంలో విఫలమవుతున్నారని, ముఖ్యంగా సిరిసిల్ల జిల్లాలో ఆశించిన స్థాయిలో పని దినాలు కల్పించలేక పోతున్నారన్నారు. జిల్లాలో 92 వేల జాబ్ కార్డులుంటే సగటున 50 రోజులలోపు మాత్రమే పని కల్పిస్తున్నారని.. 6వేలలోపు కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పని దినాలు కల్పించారన్నారు. ప్రతి ఒక్కరికి ఏటా 125 రోజుల పని కల్పించేలా ఈ పథకాన్ని అమలు చేయాలని అధికారులను కోరారు. ఈ పథకానికి అయ్యే వ్యయంలో 60 శాతం నిధులను కేంద్రం ఎప్పటికప్పుడు విడుదల చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను సైతం జాప్యం లేకుండా 40 శాతం నిధులను విడుదల చేయాలన్నారు.

పంచాయతీలకు, మున్సిపాలిటీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నయాపైసా ఇవ్వడం లేదని, కానీ నిత్యం కేంద్రంపై దుష్ప్రచారం చేయడం అలవాటుగా మారిందన్నారు. మోడీ ప్రభుత్వం ఎరువుల కొరత లేకుండా కావాల్సినన్ని ఎరువులను సరఫరా చేస్తున్నా.. వాటిని అందుబాటులో ఉంచడంలో రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదన్నారు. ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ 6 గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలను దారి మళ్లిస్తున్నారని మండిపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande