
హైదరాబాద్, 28 మార్చి (హి.స.)
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే
ఐదు రోజుల పాటు ఎండలతో పాటు అకాల వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. వాతావరణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో మార్చి 31 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది. నిన్న రాత్రి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురవగా.. రానున్న 48 గంటల్లో నగరంలో మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు, ఏప్రిల్ 3వ తేదీ నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు