
అమరావతి, 28 మార్చి (హి.స.)
ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధతపై తీర్మానం చేసేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమయింది. దీనిపై సభలో సుమారు 4 గంటలపాటు సుదీర్ఘ చర్చ జరగనుంది. అమరావతికి చట్టబద్ధత తీర్మానం చేసి.. ఆ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత హైదరాబాద్ ను పదేళ్లపాటు ఉమ్మడిరాజధానిగా చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి రాజధాని గడువు 2024 జూన్ 2 తోనే ముగిసింది. కానీ.. ఇంతవరకూ రాష్ట్ర రాజధానికి చట్టబద్ధత రాలేదు. దీంతో రాష్ట్ర రాజధానికి చట్టబద్ధత తీసుకొచ్చే దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది.
ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. ఐదున్నరకోట్ల మంది ఆంధ్రల ఆకాంక్షకు ఈ సభ ప్రతిరూపమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రగతికి ఎదురయ్యే సవాళ్లను శాశ్వతంగా తొలగించే యజ్ఞమని, ఈ పవిత్ర యజ్ఞంలో భాగస్వామ్యమయ్యే భాగ్యం మనందరికీ లభించిందన్నారు. 2014లోనే రాష్ట్రాన్ని తీరం చేర్చే బాధ్యతను ప్రజలు చంద్రబాబుకు అప్పగించారని, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అమరావతిని పక్కనపెట్టి మూడు రాజధానులంటూ అయోమయానికి గురిచేసిందని గుర్తుచేశారు. దీనివల్ల భూములిచ్చిన రైతులతో పాటు రాష్ట్రం కూడా తీవ్రంగా నష్టపోయిందని, మళ్లీ అలాంటి తప్పు జరగకూడదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. అమరావతిని రాజధానిగా 2014లోనే అన్ని పార్టీలు అంగీకరించినా.. గత ప్రభుత్వం క్రియేట్ చేసిన అయోమయంలో ఇప్పటివరకూ రాజధానికి చట్టబద్ధత లేకుండా, రాకుండా ఆగిపోయిందన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అమరావతికి చట్టబద్ధత తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV