వైద్యవిద్యలో దేశంలోనే టాప్-5 జాబితాలో తెలంగాణ
హైదరాబాద్, 29 మార్చి (హి.స.) వైద్యవిద్యలో తెలంగాణ దేశంలోనే తనదైన ముద్రవేస్తున్నది. ఐదేళ్లలో మెడికల్ కాలేజీల ఏర్పాటుతో అసాధారణ ప్రగతి సాధించింది. 2021లో రాష్ట్రంలో కేవలం 34 మెడికల్ కాలేజీలు ఉండగా, నేడు 66 కాలేజీలతో దేశంలోనే టాప్-5 రాష్ట్రాల జాబితా
Medical education


హైదరాబాద్, 29 మార్చి (హి.స.)

వైద్యవిద్యలో తెలంగాణ దేశంలోనే తనదైన ముద్రవేస్తున్నది. ఐదేళ్లలో మెడికల్ కాలేజీల ఏర్పాటుతో అసాధారణ ప్రగతి సాధించింది. 2021లో రాష్ట్రంలో కేవలం 34 మెడికల్ కాలేజీలు ఉండగా, నేడు 66 కాలేజీలతో దేశంలోనే టాప్-5 రాష్ట్రాల జాబితాలో చేరింది. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర సరసన నిలుస్తూ.. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ కంటే ముందంజలో నిలిచింది. లోక్సభలో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాలు వైద్యవిద్య పురోగతిని తెలియజేశాయి.

దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ వైద్యవిద్యలో మెరుగైన రికార్డు సొంతం చేసుకున్నది. తెలంగాణ కంటే పెద్ద రాష్ట్రాలైన తమిళనాడులో 78, కర్ణాటకలో 72, మహారాష్ట్రలో 85, ఏపీలో 39 కళాశాలలు ఉన్నాయి. ఇక దేశంలోనే అత్యధికంగా 88 మెడికల్ కాలేజీలతో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. చిన్నరాష్ట్రమైన తెలంగాణలో 66 వైద్య కళాశాలలు ఉండటం ఊహించని మలుపు అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

దేశవ్యాప్తంగా అత్యధిక మెడికల్ కాలేజీలు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 5వ స్థానంలో నిలిచింది. 2021-22 లో తెలంగాణ 34 కళాశాలలతో దేశంలోనే 6వ స్థానంలో ఉండగా, 26 నాటికి 66 కాలేజీలకు చేరుకుని చేరుకుని గుజరాత్ను వెనక్కి నెట్టి 5వ స్థానానికి ఎగబాకింది. కేవలం ఐదేళ్లలోనే రాష్ట్రంలో మెడికల్ కళాశాలల సంఖ్యను రెట్టింపు చేసుకోవడం గమనార్హం. కొత్త కాలేజీల ఏర్పాటుతో రాష్ట్రంలో, ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఎంబీబీఎస్ సీట్లు భారీగా పెరిగాయి. గ్రామీణ పేద విద్యార్థులు సైతం వైద్య విద్యను అభ్యసించే సదుపాయం కలిగింది. అలాగే వైద్యకళాశాలలు పెరగడంతో ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని చెబుతున్నారు.

ఎన్ఎంసీ అనుమతులు

నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఐదేళ్లలో దేశవ్యాప్తంగా కొత్త కాలేజీల కోసం వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. 2024-25 లో అత్యధికంగా 112 దరఖాస్తులు రాగా, అందులో 74 కాలేజీలకు అనుమతి లభించింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 80 దరఖాస్తులు అందగా... ఇప్పటివరకు 43 కాలేజీలు ఆమోదం పొందాయి. ప్రైవేట్ సంస్థలు కూడా మెడికల్ కాలేజీలు లేదా డీమ్డ్ యూనివర్సిటీలను ప్రారంభించవచ్చని.. అందుకు మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు (ఎంఏఆర్బీ) నుంచి రాతపూర్వక అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande