
తిరుమల, 30 మార్చి (హి.స.)
ఏడుకొండలపై వేంచేసి ఉండి, కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా, ప్రత్యక్ష దైవంగా పూజలందుకుంటున్న వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. వారాంతాల్లో, వరుస సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ భారీగా ఉంటోంది. సోమవారం తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గినట్లు టీటీడీ తెలిపింది. ఉదయం 8 గంటల్లోపు ఉచిత సర్వదర్శనం కోసం కేవలం 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి స్వామివారి దర్శనం 8 గంటల్లో జరుగుతుందని స్పష్టం చేసింది. సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 3-4 గంటల సమయం, రూ.300 శీఘ్రదర్శనానికి 2-3 గంటల సమయం పడుతుందని తెలిపింది. కాగా.. నిన్న స్వామివారిని 80,774 మంది భక్తులు దర్శించుకోగా.. 27,447 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల విలువ రూ.4.05 కోట్లు ఉంటుందని టీడీపీ పేర్కొంది. కాగా.. నేటి సర్వదర్శనం, దివ్యదర్శనం కోటా టికెట్లు మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. రేపటికి సంబంధించిన ఉచిత దర్శన టోకెన్లను కొద్దిసేపటిలో అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసం, శ్రీనివాసం, శ్రీవారిమెట్టు వద్ద ఇవ్వనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV